దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం
రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపసంఘం, క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేకంగా, 2019-24 మధ్యలో దేవాలయాలపై జరిగిన దాడులు, వాటిపై తీసుకున్న చర్యలపై పర్యవేక్షణ చేయాలని ఆదేశం ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. దేవాలయాల భద్రత, పర్యవేక్షణ, అవసరమైన చర్యలపై ఈ ఉపసంఘం సమగ్రంగా నివేదిక ఇవ్వనుంది. ఉపసంఘం సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
అటవీ సిబ్బంది భద్రత కోసం ‘సంజీవని’
ఏపీ రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మరించారు. వారి త్యాగం ఎన్నటికీ మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించి ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ ఉన్నతాధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ (IFS) ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలు, చూపిన ధైర్యం ప్రతీ అటవీ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. “ప్రతీ అమరవీరుని వెనుక ఒక కుటుంబం ఉంటుంది. వారు తమ ఆత్మీయుడిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, సమాజం కోసం చూపిన త్యాగం అమూల్యం. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాల పక్కన నిలిచి, వారి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుంది,” అని పవన్ కళ్యాణ్ తెలిపారు. అడవులను సంరక్షించేందుకు నిస్వార్థంగా సేవ చేస్తున్న అటవీ సిబ్బంది భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని, ‘సంజీవని’ ద్వారా మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.
ఆ మంత్రులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొంథా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసినందుకు మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతీ మంత్రి స్వయంగా ప్రాంతాల్లో ఉండి ప్రజలకు వేగంగా సహాయం అందేలా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్లే సహాయక చర్యలు అత్యంత వేగంగా జరిగాయని తెలిపారు సీఎం చంద్రబాబు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ముంచేసే కుట్ర జరుగుతుందా..?
తెలుగు ప్రజల గుండె చప్పుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముంచేసే కుట్ర జరుగుతోందా..? ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనలు ఎలా ఉన్నా, తెరవెనుక ప్లాంట్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చాప కింద నీరులా జరుగుతోందనే అనుమానాలు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి. నాలుగు దశాబ్దాల పాటు దేశీయ ఉక్కురంగంలో తనదైన ముద్ర వేసి, నాణ్యతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఇప్పుడు ‘నాణ్యతా లోపం’ అనే ముప్పు వచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక మద్దతు కనిపిస్తున్న తరుణంలో, నాణ్యతను పెంచుకోవాల్సింది పోయి… అసలుకే మోసం తెచ్చేలా క్వాలిటీ విషయంలో రాజీ పడుతున్నారనే కొత్త కుట్రలు తెరపైకి రావడం అందరినీ కలవరపెడుతోంది. జాతీయ ప్రాజెక్టుల నుంచి సామాన్యుడి ఇల్లు వరకు అందరూ కోరుకునే వైజాగ్ స్టీల్‌ను ఇప్పుడు నాణ్యత లేదంటూ కంపెనీలు వెనక్కి పంపుతున్నాయి.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దక్షిణ భారత దేశంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొంటూ.. అమృత్ భారత్ పథకం కింద రూ. 714 కోట్లతో ఈ స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 1,97,000 మంది ప్రయాణికులు రోజువారీగా ఈ స్టేషన్‌కు వస్తున్నారని, ప్రతి గంటకు సుమారు 23 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ.. పనుల వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నూతన నిర్మాణాలలో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ట్రావెలర్ తో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
సిద్ధరామయ్యకు చుక్కెదురు..హైకమాండ్ అపాయింట్‌మెంట్ నిరాకరణ!
కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య ‘కుర్చీ’ వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రెండు వర్గాలు విడిపోయారు. ప్రస్తుతం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణమే నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో మార్పులు-చేర్పులు చేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇందుకోసం హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ 15 వరకు కర్ణాటక నేతలెవరికీ అపాయింట్‌మెంట్ ఇచ్చేది లేదని అధిష్టానం పెద్దలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇది అందరికీ వర్తిస్తుందని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ప్రతి పోలింగ్ కేంద్రంపై డ్రోన్ కెమెరాలతో నిఘా..
రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. సెక్టార్ల వారీగా బూతులను విభజించి, ఎక్విప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టింది. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ జరిగింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఈవీఎంల పంపిణీ కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను ఎస్ఈసీ పూర్తి చేయనుంది. ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణలో 2600 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ రోజు రాత్రి వరకు భారీ బందోబస్తు నడుము పోలింగ్ బూత్ లకు ఈవీఎంలు చేరుకోనున్నాయి.
జోగి రమేష్‌కు వరుస షాక్‌లు..! మరిన్ని కేసులు నమోదు రంగం సిద్ధం..
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం తయారీ కేసు సంచలనం సృష్టించింది.. ఓవైపు మద్యం కుంభకోణం కేసుపై విచారణ సాగుతోన్న సమయంలో.. నకిలీ లిక్కర్ తయారీ కేసు రచ్చగా మారింది.. అయితే, ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉండగా.. జోగి రమేష్‌పై మరిన్ని కేసులు నమోదుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. తాజాగా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై కూడా మాజీ మంత్రి జోగి రమేష్‌పై కేసు నమోదు చేయనుంది సీఐడీ.. అగ్రిగోల్డ్ భూముల అమ్మకాల్లో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు సీఐడీ అధికారులు.. మరోవైపు పెడనలో కూడా భూములు క్రయ విక్రయాల్లో జోగి రమేష్‌పై పలు ఫిర్యాదులు అందాయని చెబుతున్నారు.. వీటిపై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది..
ముగిసిన ఏపీ కేబినెట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. 65కి పైగా ఎజెండా అంశాల అజెండాతో సాగిన ఈ సమావేశంలో 65కి పైగా అంశాలను ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.. వైజాగ్ లో ఈ నెలలో జరగబోయే సీఐఐ సమ్మిట్‌కు సంబంధించి చర్చ సాగింది.. క్వాoటం పాలసీకి ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. ఇక, మొంథా తుఫాన్ సందర్భంగా చేపట్టిన చర్యలపై మంత్రులకు అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోవైపు, పార్టీ కార్యాలయాల లీజ్ కు సంబంధించి చట్ట సవరణకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది..
నిజమైన హీరో.. 50 మంది విద్యార్థులను కాపాడి.. ప్రాణాలు విడిచిన స్కూల్ బస్సు డ్రైవర్..
ఏకంగా 50 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడి.. తనువు చాలించాడు ఓ స్కూల్ బస్సు డ్రైవర్.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సెంటర్‌లో ఈ రోజు ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ దెందుకూరి నారాయణరాజు (60) తన కర్తవ్య నిర్వహణలో విద్యార్థుల ప్రాణాలను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన నారాయణరాజు ప్రతి రోజు మాదిరిగానే విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్తుండగా, మడికి వద్ద జాతీయ రహదారి 216ఏపై ప్రయాణిస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయన, అప్రమత్తంగా బస్సును రోడ్డు మధ్యలో ఆపి, కిందకు దిగి రోడ్డు డివైడర్‌పై కుప్పకూలిపోయాడు. బస్సులో ఉన్న విద్యార్థులు వెంటనే విషయం తెలుసుకుని హైవే పెట్రోలింగ్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు క్షణాల్లో చేరుకుని డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నారాయణరాజు మృతిచెందారు. తన చివరి క్షణాల్లో కూడా బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులను రక్షించిన నారాయణరాజు నిజమైన హీరోగా నిలిచిపోయాడు. తనను తాను త్యాగం చేసి 50 మందిని కాపాడాడు అంటూ స్థానికులు, విద్యార్థులు భావోద్వేగానికి గురవుతున్నారు. తమతో ఎంతో అనుబంధంగా మెలిగిన డ్రైవర్ నారాయణరాజు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.
