Site icon NTV Telugu

Tomatos Theft: టమోటా దొంగలు.. పరేషాన్‌లో రైతులు

3mz2bkqc

3mz2bkqc

దేశంలో దొంగలు పడడం మామూలే కానీ. ఏపీలో దొంగలు పడ్డారు. ఆ దొంగలకు బంగారం, డబ్బు అవసరం లేదు. వారికేం కావాలో తెలిస్తే మీరే షాకవుతారు. పొలంలో పండిన టమోటా బాక్సులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. టమోటా ధరలు ఆకాశాన్నంటిన వేళ దొంగల కళ్ళు టమోటాలపై పడ్డాయి. చిత్తూరు జిల్లా సోమల మండలంలో టమోటాల కోసం దొంగలు పడ్డరు.

రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటడంతో చిత్తూరు జిల్లా సోమలలో దొంగల బెడద ఎక్కువైందని రైతులు వాపోతున్నారు.ఇన్నిరోజులు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు ఇప్పుడు దొంగల భయం పట్టుకుంది. టమోటా రేట్లు పెరగడంతో ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారని రైతులు చెబుతున్నారు.చిన్న సోమల మార్గంలో రోడ్డు పక్కన ఉన్న తోటలో సుమారు ఐదు బాక్సుల మేర టమోటాలను దుండగులు కోసుకెళ్లినట్టు బాధిత రైతు జగన్మోహన్ తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తే దొంగతనాలకు చెక్ పెట్టొచ్చని రైతులు అంటున్నారు. శాంతి భద్రతలకు సమయం సరిపోవడం లేదంటే.. టమోటా తోటలకు మేం ఎక్కడ కాపలా కాస్తామని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఉల్లిపాయలు రేట్లు వంద రూపాయలకు చేరినప్పుడు కూడా ఉల్లి దొంగలు రంగ ప్రవేశం చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో టమోటాలు భారీ ధర పలుకుతున్నాయి. నిన్న మొన్నటివరకూ 50 నుంచి 75 రూపాయలు పలికిన ధరలు ఇప్పుడు వంద దాటేశాయి. మరికొద్ది రోజుల ఈ ధరల మంట తప్పదంటున్నారు వ్యాపారులు. ధరలు పెరగడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. టమోటాల దొంగతనం గురించి తెలుసుకుని జనం నవ్వుకుంటున్నారు.

ఇదిలా వుంటే టమోటాలు కొనలేక సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వంటింట్లో టమోటా వాడకాన్ని తాత్కాలికంగా ఆపేశారు. విశాఖలో టమోటాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో సబ్సిడీపై టమోటాల అమ్మకాలు చేపట్టారు. కేజీ 60కి చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. మదనపల్లె నుంచి తెప్పించి ప్రతీ రైతు బజారుకు రెండు టన్నులు పంపిణీ చేయనున్నారు. ప్రతి వినియోగదారుడికి ఒక కిలో మాత్రం ఇవ్వనున్నారు.

Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్‌.. పెరుగనున్న రీఛార్జ్‌ ధరలు..

Exit mobile version