NTV Telugu Site icon

Tirumala Temple: రెండు రోజుల పాటు మూతపడనున్న తిరుమల శ్రీవారి ఆలయం.. ఎందుకంటే..?

Tirumala Temple

Tirumala Temple

Tirumala Temple: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబ‌ర్ నెల‌లో ఒక రోజు, నవంబ‌ర్ నెల‌లో మ‌రో రోజు ఆల‌యాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటనలో టీటీడీ పేర్కొంది. అక్టోబరు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5:11 గంట‌ల నుండి 6:27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. దీంతో ఉదయం 8:11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆల‌యాన్ని మూసివేస్తామని తెలిపింది. అదే మాదిరిగా నవంబర్‌ 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2:39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కారణంగా ఉదయం 8:40 గంటల నుంచి రాత్రి 7:20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.

Read Also: పదే పదే ముఖాన్ని కడుగుతున్నారా?.. అస్సలు మంచిది కాదండోయ్..

కాగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కారణంగా ఆ రెండు రోజుల పాటు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఆయా రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 దర్శనం), కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వివరించింది. ఆయా రోజుల్లో గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి టిటిడికి స‌హ‌క‌రించాల‌ని కోరింది. కాగా ఈనెల 27 నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు ఇవ్వొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.

Show comments