Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ అందించింది. డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 11న ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నామని టీటీడీ వెల్లడించింది. ఈనెల 11న ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తున్నందున భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ నెల మొత్తానికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ టిక్కెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని పేర్కొంది.
Read Also: మన దేశంలోని 10 ప్రముఖ దేవాలయాలు.. తప్పక విచ్చేయాల్సిందే!
కాగా కరోనా మహమ్మారి తరువాత తిరుమలలో పూర్తిగా నిబంధనలు ఎత్తివేయడంతో కొన్ని నెలలుగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. డిసెంబర్ నెలలో అధిక పెళ్లిళ్లు ఉండటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అటు శ్రీవారిని ఉచితంగా దర్శించుకోవాలని భావించే సీనియర్ సిటిజన్‌లకు కూడా ప్రత్యే్కమైన స్లాట్లు ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్‌లకు శ్రీవారి దర్శనం కల్పించనుంది. ఇందుకోసం సీనియర్ సిటిజన్‌లు ఫోటో ఐడీతో పాటు వయసు ధ్రువీకరణను తెలియజేస్తూ తిరుమలలోని ఎస్-1 కౌంటర్‌లో దరఖాస్తు సమర్పించాలని.. ఈ స్లాట్లలో దర్శనానికి వచ్చే సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది.