TTD Hundi Revenue: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్‌ను దాటింది.. వరుసగా 33వ నెల 100 కోట్ల మార్కుని దాటింది. నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా 111 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీనితో ఈ ఏడాది మొత్తంగా స్వామివారికి 11 నెలల కాలంలో హుండీ ద్వారా 1,253 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అయ్యింది.. కాగా, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ మొక్కులు చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా స్వామివారికి నిత్యం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు హుండీ ద్వారా ఆదాయం లభిస్తుంది. దీనితో నెలకి 100 కోట్లు పైగా స్వామివారికి హుండీ ఆదాయం లభిస్తుండగా ఏడాదికి హుండీ ద్వారా లభించే ఆదాయం 1300 కోట్లను దాటేస్తుంది.
Read Also: Saudi Arabia: ఏడాదిలో 300 మందికి పైగా మరణశిక్షలు అమలు చేసిన సౌదీ అరేబియా..
ఈ ఏడాది వరసగా స్వామివారికి 33వ నెల కూడా హుండీ ఆదాయం 100 కోట్ల మార్క్ ని దాటింది. కోవిడ్ కాలంలో తగ్గిన స్వామివారి హుండీ ఆదాయం.. అటు తరువాత 2022 మార్చి నుంచి కూడా ప్రతినెలా వందకోట్ల మార్కును దాటుతూ వస్తుంది. కాకపోతే గత ఏడాదితో పోలిస్తే మాత్రం ఈ ఏడాది స్వామివారికి లభిస్తున్న కానుకలు కొంత తగుముఖం పట్టింది. ఈ ఏడాది జనవరి నెలలో శ్రీవారికి 116 కోట్లు.. ఫిబ్రవరి నెలలో 112 కోట్లు.. మార్చి నెలలో 118 కోట్లు.. ఏప్రిల్ నెలలో 101 కోట్లు.. మే నెలలో 108 కోట్లు.. జూన్ నెలలో 114 కోట్లు.. జూలై నెలలో 125 కోట్లు.. ఆగస్టు నెలలో 126 కోట్లు.. సెప్టెంబర్ నెలలో 114 కోట్లు.. అక్టోబర్ నెలలో 127 కోట్లు.. నవంబర్ నెలలో 111 కోట్ల రూపాయలు హుండీ ద్వారా స్వామివారికి ఆదాయం లభించింది. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీవారికి 1253 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. డిసెంబర్ నెలతో కలిపితే స్వామివారి హుండీ ఆదాయం 1360 కోట్ల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.