Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన అనుభూతి కల్పించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారికి అభిషేక సేవ నిర్వహిస్తున్న సమయంలోనూ సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.. ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి సేవలు, దర్శనం అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయ లక్ష్యంగా పేర్కొంది. వైకుంఠ ద్వార దర్శనాన్ని మరింత మంది భక్తులకు కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగా, శుక్రవారం రోజున అదనంగా 5,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
Read Also: Amaravati: ల్యాండ్ పూలింగ్‌కి భూములు.. రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైనులో వేచి ఉన్నారు. ప్రస్తుతం సుమారు 28,000 మంది సర్వదర్శన భక్తులు శ్రీవారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. సర్వదర్శన భక్తులకు సగటున 20 గంటల దర్శన నిరీక్షణ సమయం పడుతోంది. టీటీడీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నిన్న శ్రీవారిని 65,225 మంది భక్తులు దర్శించుకున్నారు.. 31,106 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ఇదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా వెల్లడించింది టీటీడీ.. అయితే, మూడు రోజుల్లో వైకుంఠ ద్వారం ద్వారా 2,02,000 పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. ఇక, అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించేందుకు టీటీడీ ఇవాళ నుంచి టోకెన్ లేకుండానే సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భక్తులను అవుటర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.