NTV Telugu Site icon

TTD: ఈనెల 28వ తేదీ నుండి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. విస్తృత ఏర్పాట్లు

Tiruchanur Ammavaru

Tiruchanur Ammavaru

ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందుకు సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామల రావు మాట్లాడారు. ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 6న జరిగే పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పంచమి తీర్థానికి వేలాది మంది భక్తులు పాల్గొంటారు.. ఆ రోజు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నామని టీటీడీ ఈవో తెలిపారు. పంచమి తీర్థానికి విచ్చేసే భక్తులకు ముందు రోజు రాత్రి నుండే భక్తులకు కేటాయించిన ప్రాంతాల్లో భోజనం మొదలుకొని అన్ని రకాల వసతి సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయ్యాయని ఈవో పేర్కొన్నారు. పంచమి రోజున 1500 మంది అదనపు సిబ్బందితో భద్రత ఉంటుందని చెప్పారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అత్యంత వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీ అధికారులు చేపట్టిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఈవో శ్యామల రావు పేర్కొన్నారు.

Read Also: Kalpana Soran: కేబినెట్‌లోకి కల్పనా సోరెన్.. కీలక పోస్టు దక్కే ఛాన్స్!

అంతకుముందు బ్రహ్మోత్సవాలపై ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్‌, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. వాహనసేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలని అన్నారు. శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనసేవల్లో ఏనుగులు, అశ్వాలు, వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ఈవో జే శ్యామలరావు అన్నారు.

Show comments