Site icon NTV Telugu

Tirumala: తిరుమలకు రికార్డుస్థాయిలో భక్తులు.. హుండీ ఆదాయం..!

Ttd

Ttd

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. ఇక, వికేండ్ లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటే.. వేసవి సెలవుల్లో అయితే భక్తుల తాకిడి మరింత ఎక్కువగా వుంటుంది. దీనితో సర్వదర్శనం భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివుండే సమయం కూడా అంతకంతకూ పెరుగుతుంది. టోకేన్ లేకుండా తిరుమల చేరుకునే సర్వదర్శనం భక్తులు స్వామివారి దర్శనభాగ్యం కోసం 24 గంటల సమయం వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితిలో దృష్యా లఘు దర్శన విధానాన్ని అమలు చేస్తే గంటకు నాలుగు నుంచి నాలుగువేల ఐదు వందల మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. ఇక శ్రీవారి ఆలయంలో స్వామివారి నిర్వహించే పూజా కైంకర్యాల సమయాని మినహాయిస్తే మిగిలిన సమయాల్లో స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తుంది టీటీడీ.. గురు, శుక్రవారాల్లో 15 నుంచి 16 గంటల సమయం.. మంగళవారం 18 గంటల సమయం.. మిగిలిన రోజులో 19 గంటల సమయం పాటు భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం టీటీడీకి లభిస్తుంది.. దీనితో గురు, శుక్రవారాల్లో 65 వేల మంది భక్తులకు.. మిగిలిన రోజులో 80 నుంచి 85 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది.

Read Also: US: అమెరికా వీధుల్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ మ్యాన్‌హోల్ కవర్లు..! నెట్టింట చర్చ?

ఈ ఏడాది మే నెలలో మొదటి 15 రోజులు భక్తుల తాకిడి పెద్దగా లేనప్పటికీ అటు తరువాత నుంచి భక్తులు తాకిడి పెరగడంతో టీడీడీ అప్రమత్తమైంది. ఈవో శ్యామలరావు ఆదేశాలతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిరంతరాయంగా క్యూ లైను మేనేజ్మెంట్ పై దృష్టి సారించారు. ప్రధానంగా రాత్రి 9 గంటల నుంచి ఏకాంత సేవ నిర్వహించే సమయం వరకు కూడా టోకేన్ లేని భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తూండడంతో ఆ సమయంలో క్యూ లైన్ మేనేజ్మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అన్ని విభాగాల వారిని సమన్వయం చేస్తూ గంటకు 4900 నుంచి 5 వేల మంది భక్తులకు స్వామివారి దర్శనం భాగ్యం కల్పించడంతో రోజుకి అదనంగా 10 వేల మంది వరకు భక్తులు స్వామివారి దర్శనభాగ్యం లభించింది. ఎన్నడు లేని విధంగా గురువారం రోజున 72 వేల మంది.. శుక్రవారం రోజున 74 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. శని ,ఆదివారాల్లో 90 వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక సోమవారం రోజున 83 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Read Also: Fatehnagar Flyover: శిథిలావస్థ స్థితిలో ఫతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి..

మరో వైపు స్వామివారి రోజు వారి హుండీ ఆదాయం కూడా చాలా రోజులు తరువాత 5 కోట్ల మార్క్ ని దాటింది. దీనితో ఐదు రోజులు వ్యవధిలో స్వామివారికి హుండీ ద్వారా 19 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మరో వైపు శ్రీవారికి ఐదు రోజులు వ్యవధిలో 2 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం రోజు అయితే ఏకంగా 46 వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అన్నప్రసాదం సముదాయంతో పాటు క్యూ లైనులో వేచివున్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యం కల్పించింది. ఇలా ఐదు రోజులో 12 లక్షల భోజనాలు భక్తులకు సరఫరా చేసింది టీటీడీ.. మొత్తంగా వికేండ్ లో శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా సేవలందించడంతో పాటు అత్యధిక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)

Exit mobile version