Temple : అమ్మోరు తల్లి.. క్షమించు… తెలియక తప్పు చేశాం.. నీ ఆలయంలో దొంగతనం చేయడం నేరమే.. అందుకు శిక్ష అనుభవిస్తున్నాం. ఇవిగో నీ దగ్గర దొంగిలించిన సొమ్ము.. నీవే తీసుకో తల్లి. దయచేసి మమ్మల్ని ఒగ్గెయ్ తల్లి…. ఇదీ దొంగలు రాసిన లేఖ. అదే ఆలయంలో చోరీ చేసి.. తిరిగి ఆ సొమ్మును అమ్మవారి ఆలయం వద్దే తీసుకు వచ్చి పెట్టేశారు. పైగా అందులో.. అమ్మవారిని క్షమించాలని వేడుకుంటూ లేఖ రాశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో జరిగింది. దొంగలు చేసిన ఈ విచిత్ర పనికి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Crime News : రాత్రికి రాత్రే మాయమైన సమాధులు
బుక్కరాయసముద్రంలోని ముసలమ్మ దేవాలయం ఇది. ఈ ఆలయంలో నెల రోజుల క్రితం హుండీ చోరీ జరిగింది. నేరుగా ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు హుండీ దోచుకుని వెళ్లారు. దాదాపు 2 లక్షల రూపాయల వరకు హుండీలో ఉన్న సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లారు. అప్పట్లో పోలీసులకు కూడా ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు దొంగలు దొరకలేదు. కేసు ఇంకా దర్యాప్తు స్టేజ్‌లోనే ఉంది. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే ఆలయ ఆవరణలో అద్భుతం జరిగింది. పోయింది అనుకున్న హుండీ డబ్బు.. ఆలయ ఆవరణలోని ఓ మూటలో ప్రత్యక్షమైంది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమక్షంలో ఆలయ ధర్మకర్తలు, ఇతర సిబ్బంది.. మూటని తెరిచి చూశారు. అందులో హుండీ సొమ్ముతో పాటు లేఖ కూడా ఉంది. అది దొంగలు రాసిన లేఖ. ఆలయంలో నెల రోజుల క్రితం నలుగురం కలిసి దొంగతనం చేశామని.. కానీ అప్పటి నుంచి తమ పిల్లలకు ఆరోగ్యాలు బాగా ఉండడం లేదని..కాబట్టి అమ్మవారి సొమ్ము అమ్మవారికే అప్పచెప్పుతున్నామని అందులో రాశారు.
ఆ లేఖలో దొంగలు చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. పిల్లలు అనారోగ్యాల పాలైన కారణంగా కొంత డబ్బు ఆస్పత్రి ఖర్చులకు వాడుకున్నామని లేఖలో తెలిపారు. ఐతే మూటలోని సొమ్మును లెక్కించడంతో రూ. లక్షా 86వేల నగదు ఉన్నట్లుగా తేలింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చివరగా ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పోయిందనుకున్న అమ్మవారి సొమ్ము తిరిగి రావడంతో ఆలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు…
