అనంతపురంలోని SSBN కళాశాలలో చోటు చేసుకున్న ఘటన పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యా ర్థులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని.. విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యా ర్థులను రెచ్చగొట్టారన్నారు. ఈ క్రమంలో వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు.
పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేశారన్నారు మంత్రి సురేష్. ఈ సంఘటనను ప్రాథమిక నివేదికగా తీసుకున్నామన్న ఆయన.. 1991 నుంచి స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఈ ప్రాంగణంలో నడుస్తున్నాయన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను రద్దు చేసుకుంటున్నట్లు కాలేజీ ప్రభుత్వానికి స్పష్టం చేసిందన్నారు. విద్యా ర్థుల, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే కుట్రతోనే అనంతపురం ఘటనకు తెర లేపారన్నారు. ఒక విద్యార్థినిపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారన్నారు. పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎక్కడి నుంచో రాయి వచ్చి తగిలిందని స్వయంగా గాయపడిన అమ్మాయి వీడియో విడుదల చేసిందని మంత్రి తెలిపారు.
అయినా రాజకీయం చేయటానికి లోకేష్, చంద్రబాబు రంగంలో దిగారని వారిపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడైనా ఎయిడెడ్ విద్యా సంస్థల గురించి ఎప్పుడైనా సమీక్ష చేశారా అంటూ ఈ సందర్భంగా ఆయనను మంత్రి ప్రశ్నించారు. మంత్రి మాట్లాడు తుండగానే మంత్రి మీడియా సమావేశం ప్రాంగణంలోకి దూసుకు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు ఘెరావ్ చేశారు. దీంతో మంత్రి మీడియా సమావేశాన్ని మధ్యలోనే ఆపి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లా SSBN కళాశాలలో విద్యార్థుల పై లాఠీచార్జి ఘటన పై మంత్రి క్షమాపణలు చెప్పాలని విద్యార్థి సంఘాలు TNSF, PDSO డిమాండ్ చేస్తున్నాయి.