Telugu States CM YS Jagan Mohan Reddy KCR Pay Tributes To Krishna Demise: సూపర్‌స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం 4:07 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కన్నుమూశారు. ఈయన మృతితో ఘట్టమనేని కుటుంబంతో పాటు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ తారలతో పాటు రాజకీయ ప్రముఖులు తమ సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నటశేఖరుడి అస్తమయంపై స్పందించారు.
‘‘కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి.. ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం.. తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్‌కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విటర్ మాధ్యమంగా సంతాపం తెలియజేశారు. వైఎస్ కుటుంబానికి ఘట్టమనేని కుటుంబంతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే! రాజీవ్ గాంధీ ప్రోత్సాహాంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కృష్ణ.. ఆయన మరణించిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక.. కృష్ణ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని కృష్ణ సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచే వైఎస్ కుటుంబంతో కృష్టకి గట్టి బాండింగ్ ఏర్పడింది.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా.. ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారన్నారు. అటు.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి ఆర్కే రోజా, గవర్నర్ తమిళిసై కృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపారు.