Julakanti Brahma Reddy: పల్నాడు జిల్లా మాచర్లలో పొలిటికల్ హీట్ నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పుపెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మాచర్ల టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. తమ ఇళ్లను తామే తగులబెట్టుకున్నామని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మాచర్ల మెయిన్ రోడ్డుపై ఉన్న షాపుల్లో కరపత్రాలు పంచుతున్నామని.. ఆ సమయంలో వైసీపీ నేతలు తమపై దాడులకు తెగబడ్డారని వెల్లడించారు. మాచర్లలో వైసీపీ అకృత్యాలకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ నేతలు కర్రలు పట్టుకుని నిలబడ్డారని.. రెండు గంటల పాటు కర్రలతో వైసీపీ నేతలు హల్‌చల్ చేసినా పోలీసులు చోద్యం చూస్తూనే ఉన్నారని విమర్శించారు.
Read Also: Varasudu: ‘వారసుడు’ను మహేశ్, చరణ్ వద్దన్నారా!?
మరోవైపు శాంతియుతంగా ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలపై వైసీపీ నేతలు రాళ్లు.. సోడా బుడ్లతో దాడి చేశారని.. టీడీపీ కార్యకర్తలు ఓపిక నశించి ప్రతిఘటించారని తెలిపారు. అప్పుడు పోలీసులు వచ్చి తమపై లాఠీఛార్జ్ చేశారన్నారు. లా అండ్ ఆర్డర్ తప్పుతుందని తనను బయటకు పంపారని.. నను బయటకు పంపే సమయంలో ఎస్కార్ట్ ఇవ్వలేదని.. తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారులు మాచర్ల వచ్చాకే వైసీపీ కార్యకర్తలు కార్లు తగులపెట్టారని.. ఇళ్లల్లో జొరబడి లూటీలు చేశారన్నారు. ఓ బీసీ నాయకుడు, ఓ ఎస్టీ నేత ఇంటి మీద వైసీపీ నేతలు దాడి చేశారని విమర్శలు చేశారు. శనివారం కూడా మాచర్లలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని.. సగం కాలిన ఆఫీసుపై మరోసారి దాడి చేసి క్యాష్ ఎత్తుకుపోయారని విమర్శించారు. ఎస్పీ స్వయంగా మాచర్లలో ఉండి పర్యవేక్షణ చేస్తున్నా ఇలా అరాచకాలు జరగడం ఏంటని జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు.