ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు అమాంతం పెంచి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గురువారం కోవెలకుంట్ల మండలం లోని కలుగొట్ల గ్రామంలో ఆయన పర్యటించి విద్యుత్ సమస్య కరెంట్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
వైసీపీ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ విద్యుత్ బిల్లులు పెంచి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. విద్యుత్ యూనిట్ ధర మూడు రూపాయలు ఉంటే దానిని దాదాపు ఆరు ,ఏడు రూపాయలు పెంచి ప్రజల పెను భారం మోపారని మండిపడ్డారు. ఒకవైపు పెట్రోల్, గ్యాస్, కూరగాయల ధరలు పెరిగి సామాన్యులు నానా ఇబ్బందులు పడుతుంటే.. కరెంట్ ఛార్జీలు పెంచడం దారుణం అన్నారు. ప్రభుత్వం వెంటనే ట్రూ అప్ ఛార్జీల భారం ఉపసంహరించుకోవాలన్నారు