Tamota Prices: టమోటా ధర మరోసారి రైతులను కన్నీరు పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో కేవలం రూపాయే పలికింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం పొలం నుంచి మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 కిలోలు చొప్పున ఉండే 15 గంపల టమోటాలకు పత్తికొండ మార్కెట్‌కు తెచ్చి విక్రయిస్తే కమీషన్ పోగా రైతులకు మిగిలింది కిలోకు కేవలం రూపాయి మాత్రమేనని వాపోతున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లో మాత్రం కిలో టమోటాను అధిక ధరకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు మాత్రం మద్దతు ధర ఇవ్వడం లేదని.. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని టమోటా రైతులు కోరుతున్నారు.
Read Also: IPL 2023 Retention: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బుంది?
అటు ఉల్లి పరిస్థితి కూడా ఇలాగే ఉందని రైతులు వాపోతున్నారు. కర్నూలులో కిలో ఉల్లి రూ.6 నుంచి రూ.8 మాత్రమే పలుకుతోంది. దీంతో తమకు గిట్టుబాటు కావడం లేదని ఉల్లి రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు తక్కువ ధరకే అమ్ముకునేవరకు ప్రభుత్వం నిద్ర నటిస్తోందని.. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇస్తోందని మండిపడుతున్నారు. ఉల్లి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రూ.770 చొప్పున నిర్ణయించినా కర్నూలు జిల్లాలో ఈ ధరకు ఎక్కడా కొనడటం లేదు. వ్యాపారులు రూ.600 నుంచి రూ.700 చొప్పున మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్తున్నా ఆ మాటలు చెత్త బుట్టలకే దాఖలవుతున్నాయని.. దీంతో రైతులకు మద్దతు ధర లభించడం లేదని పలువురు విమర్శలు చేస్తున్నారు.