NTV Telugu Site icon

Assembly Seats: ఈసీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ సర్కారులకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court

Supreme Court

Supreme Court: తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుండి 225 వరకు పెంచాలని.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని నిబంధనను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పర్యావర నిపుణుడు ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019లో పొందుపరిచిన విధంగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 83 నుండి 90 వరకు పెంచేందుకు 2020లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వును ఈ ఏడాది మే 5న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోని రాజకీయ శాస్త్ర విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Read Also:AP High Court: మోహన్‌బాబు అండ్ సన్స్‌కు హైకోర్టులో ఊరట..!!

తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుదల, ఏపీ చట్టంలోని సెక్షన్ 26లోని నిబంధన, రాజ్యాంగంలోని 170వ అధికరణంలోని నిబంధనలకు లోబడి ఉండాలని ఉందని, అందువల్ల 2031 తరువాత జరిగే మొదటి జనాభా సంఖ్యా అందుబాటులోకి వచ్చేవరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉండదని కేంద్ర ప్రభుత్వం గతంలో వెల్లడించింది. సుప్రీంకోర్టు విచారణ తర్వాత రెండు అవకాశాలు ఉంటాయి. మొదటిది కాశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగం, చట్టాన్ని ఉల్లంఘించినట్లు తీర్పు రావచ్చు. అప్పుడు కాశ్మీర్‌లో ఇప్పటికే ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. రెండోది కాశ్మీర్‌లో సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియతో ముందుకు సాగడానికి అవసరమైన రాజ్యాంగ, చట్టబద్ధమైన సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే అది రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియకు మార్గం సుగమం చేస్తుంది.