Site icon NTV Telugu

Ayyanna Patrudu: సుప్రీంకోర్టులో అయ్యన్నపాత్రుడుకి ఎదురుదెబ్బ.. దర్యాప్తునకు అనుమతి

Ayyanna Patrudu

Ayyanna Patrudu

Ayyanna Patrudu: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. అయ్యన్నపాత్రుడుపై ఫోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.. ఈ కేసులో జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.. అయితే, బిల్డింగ్‌ ప్లాన్‌ విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో అయ్యన్నపాత్రుడు పై ఆరోపణలు వచ్చాయి.. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రధాన కేసును మెరిట్ ఆధారంగా విచారణ చేయాలని హైకోర్టుకు సూచించింది సుప్రీంకోర్టు.

Read Also: Minister Peddireddy Ramachandra Reddy: మనం పార్టీ కోసం శ్రమించాలి.. సీఎం మనకోసం కృషి చేస్తారు..

అయితే, ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌పై గతంలో ఫోర్జరీ కేసు నమోదైంది.. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేసినట్టు అభియోగాలున్నాయి.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్‌ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని పేర్కొనగా.. ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.. ఈ వ్యవహారం మొత్తం రెవెన్యూ అధికారుల సర్వేలో బయటపడినట్టు చెబుతున్నారు.. ఆ తర్వతా అక్రమ కట్టడాలని కూల్చేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నారు.. ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలతో పత్రాలను సృష్టించి సక్రమ నిర్మాణమే అని చెప్పుకునేందుకు యత్నించారంటూ అధికారులు కేసు పెట్టారు. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది.. అక్కడ అయ్యన్నపాత్రుడికి ఊరట దక్కినా.. ఇప్పుడు సుప్రీంకోర్టులో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది.

Exit mobile version