Site icon NTV Telugu

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతికి ఏపీ సీఎం, గవర్నర్ సంతాపం

Ap Gov

Ap Gov

తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. ఇవాళ తెల్లవారు జామున హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు కృష్ణ.. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు కృష్ణ. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్‌తో పాటు కిడ్నీ, లంగ్స్ ఎఫెక్ట్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. ఆయన వయసు 79 ఏళ్ళు. కృష్ణ మృతికి తీవ్ర సంతాపం తెలిపారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఆయన లేని లోటు తీర్చలేనిదని వారు పేర్కొన్నారు.

Read Also: Super Star Krishna Passes Away Live: సూపర్ స్టార్ కన్నుమూత

టాలీవుడ్‌లో తన సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉన్న ఆంధ్రా జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామ చిత్రంలో రామరాజు పాత్రను చిరస్థాయిగా నిలిపి, తన ప్రఖ్యాత కెరీర్‌లో ఎన్నో హిట్‌లు సాధించారని, ముఖ్యమంత్రి తన సంతాపాన్ని తెలిపారు. కృష్ణ కుమారుడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసారు సీఎం జగన్మోహన్ రెడ్డి..

కృష్ణ మృతికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి (కృష్ణ) 79 మరణం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం ప్రకటించారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు.

350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు, సామాజిక స్పృహ కల్పించే పలు చిత్రాలతో కృష్ణ జనాదరణ పొందారన్నారు. సొంత నిర్మాణ సంస్థ ద్వారా సినీ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. సూపర్ స్టార్ కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read Also: Mahesh Babu: ఒకే ఏడాదిలో మూడు విషాదాలు.. బాధలో మహేశ్ బాబు

https://youtu.be/rgybCb4Awr0

 

Exit mobile version