విద్యార్ధుల మధ్య చిన్న చిన్న గొడవలు వివాదాలకు, దాడులకు కారణం అవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామం జడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థులు రేజర్ బ్లేడ్లు తో దాడిచేసి ఇద్దరు విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. ఒక విద్యార్థికి పొట్ట భాగం లోతుగా గాయం కాగా, మరో విద్యార్థి భుజం, చేతిపై గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే పాఠశాల ఉపాధ్యాయులు, అభివృద్ధి కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కొన్ని గంటల పాటు ఎవరికీ తెలియకుండా గోప్యత పాటించారని విద్యార్థులు వాపోతున్నారు.
స్థానికంగా వైద్యం చేయించి పోలీసు కేసులు లేకుండా రాజీ ప్రయత్నాలు చేశారు అక్కడి నాయకులు. బాధితుల తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో స్కూల్ దగ్గరికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేస్తామని, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మత్స్యపురి హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. వీరిని విడదీయడానికి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇద్దరు అడ్డు వెళ్లగా వారిని బ్లేడుతో గాయపరిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమాధానం పలు అనుమానాలకు రేకెత్తిస్తున్నాయి. తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు బెంచీలపై, కొంతమంది క్రింద కూర్చోవడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయని అందువల్లే గొడవ జరిగిందని విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ చెబుతున్నారు. గొడవ పై నరసాపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.