Minister Atchannaidu: ప్రజలు తమ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకపై ఉండదని.. ముఖ్యంగా 22ఏ భూ సమస్యల నుంచి రైతులకు, సామాన్యులకు విముక్తి కలిగించి, వారి భూమిపై వారికి పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీ చేతికి మీ భూమి – 22ఏ భూ స్వేచ్ఛ’ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని 10 గంటల పాటు ఏకధాటిగా ఫిర్యాదులు స్వీకరించారు. సాధ్యమైనంత వరకూ వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపారు.
Read Also: Viral Video: మ్యాచ్లో తనకు బ్యాటింగ్ రాలేదన్న కోపంతో.. ఏకంగా ట్రాక్టర్ తీసుకొని దున్నేసాడు..!
క్షేత్రస్థాయిలోనే పరిష్కారం
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌కు వస్తున్న వినతుల్లో 90 శాతం రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయని గుర్తు చేశారు. వీటిని పరిష్కరించేందుకు వీఆర్వో స్థాయి నుంచి కలెక్టర్ వరకు యంత్రాంగమంతా ఒకే చోట చేరి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భూ సమస్యలను శాశ్వతంగా తగ్గించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి తహసిల్దార్లకు, ఆర్డీవోలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ జీవో జారీ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిరోజూ తన లాగిన్ ద్వారా ఈ సమస్యల పరిష్కార పురోగతిని పర్యవేక్షిస్తున్నారని, న్యాయపరమైన చిక్కులు ఉన్నవి మినహా మిగిలిన ప్రతి సమస్యను పరిష్కరించి రికార్డులను అప్‌డేట్ చేయాలని ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. గతంలో అనేక గ్రామాలు మొత్తం 22ఏ పరిధిలోకి వెళ్లాయని, వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌లో భాగంగా మంత్రి చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు భూ విముక్తి ధృవీకరణ పత్రాలను అందజేశారు. తొలి పత్రాన్ని అందుకున్న సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురానికి చెందిన మల్లా భారతమ్మ మాట్లాడుతూ మా జిరాయితీ భూమి ఎన్నో ఏళ్లుగా 22ఏలో చిక్కుకుపోయింది. దీని కోసం ఎంతో కాలంగా పోరాడుతున్నాం. నేడు మాతో పాటు మా సర్వే నంబర్‌లోని 19 మందికి విముక్తి లభించింది. ప్రభుత్వానికి, మంత్రికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సోంపేట మండలానికి చెందిన సనపల వాసుదేవరావు, మందసకు చెందిన జుత్తు తారకేశ్వరరావు, ఎచ్చెర్ల మండలానికి చెందిన కొనతల అప్పారావు తదితరులకు వేదికపై ధృవపత్రాలను అందజేశారు. ఇక, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జిరాయితీ భూములను కూడా రీ-సర్వే పేరుతో 22ఏలో చేర్చడం వల్ల సామాన్య ప్రజలు తమ అవసరాలకు భూమి అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదును ‘ఈ-ఆఫీస్’ ద్వారా నమోదు చేసి, ఇక్కడే ఉన్న అన్ని స్థాయిల అధికారులు తక్షణమే పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, , జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్మణ మూర్తి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లావణ్య, పద్మావతి ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణ మూర్తి, వెంకటేష్, అన్ని మండల తహసిల్దార్లు, సర్వేయర్లు, ఎండోమెంట్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, అటవీ శాఖాధికారులు, విఆర్ఓలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.