Illegal Sand Smuggling: నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మీదుగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పుష్ప సినిమాలో ఎర్రచందనం సరిహద్దులు దాటించిన తరహాలోనే ఇసుకను కూడా తరలిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. తడ నుంచి బయలుదేరిన లారీ, చిత్తూరు మీదుగా తమిళనాడులోని తిరుత్తణి రూట్‌లో ప్రయాణిస్తోంది. అయితే, ప్రమాదవశాత్తూ అనంతాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శెట్టింతంగాళ్ దగ్గర ఒక్కసారిగా లారీ టైరు పేలిపోవడంతో అది రోడ్డు మీదే ఆగిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు ఆరా తీసే క్రమంలో లారీ నుంచి ఇసుక రాలుతుండటం బయటపడింది.
Read Also: Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఏ బిల్లులు ఆమోదం పొందాయంటే?
అయితే, లారీలో వరిపొట్టు ఉందని, తమిళనాడుకు వెళ్తున్నామని డ్రైవర్ చెప్పడంతో అనుమానం కలిగిన స్థానికులు, లారీపై కప్పిన టార్పాలిన్ తొలగించి చూడగా పైన వరిపొట్టు బస్తాలు కింద ఇసుక ఉన్నట్లే తేలింది. వెంటనే వారు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక, రంగంలోకి దిగిన ఎస్ఐ నాగసౌజన్య లారీ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఈ అక్రమ రవాణా కొనసాగుతోందని, దీని వెనుక నెల్లూరుకు చెందిన ఓ నేత ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.