EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్ లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్నకుమార్ రెడ్డి.. విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు, దాడి గురించి తెలిసిన వెంటనే.. వైసీపీ కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటికి భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఇక, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదు.. ప్రసన్న కుమార్ నిజాలు మాట్లాడితే జిర్ణించుకోలేని టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారు అని ఆరోపించారు. 60, 70 మంది వచ్చి ఇంటిని ధ్వంసం చేశారు.. ప్రసన్న కుమార్ రెడ్డిని హత మార్చాలని వచ్చారు.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఇలాంటి దాడులు చేయడం దారుణం అన్నారు. మేము తలుచుకుంటే ఇలాంటి అనేకం చేయగలం.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.