ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్‌ను టీడీపీ సీరియస్‌గా తీసుకుంటుందా? నానిని బుజ్జగిస్తుందా? టీడీపీలో ప్రస్తుతం ఇదే చర్చ. గతంలో ఇదే మాదిరి అలిగిన బుచ్చయ్య చౌదరిని కొద్దిరోజులకే తిరిగి లైనులోకి తీసుకురావడంలో అధినాయకత్వం సక్సెస్ అయింది. మరి.. కేశినేని నానిని తిరిగి ట్రాక్‌లో పెట్టగలదా?
అవమానాలు ఎక్కువై అసంతృప్తి గళాలు..!
తెలుగుదేశం పార్టీలో ఒక్కొక్క సీనియర్ నెమ్మదిగా అసమ్మతి రాగం అందుకుంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తమ అసంతృప్తిని బయట పెడుతున్నారు. అన్ని వేళ్లూ అధినేత, అధినేత తనయుడివైనే చూపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాలపై కొందరు అసంతృప్తిగా ఉంటే.. ఇంకొందరు వ్యక్తిగత విషయాలలో హైకమాండ్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఎంతకీ సమస్య పరిష్కారంకాక.. అవమానాలు ఎక్కువ అవడంతో అసంతృప్తి గళాలు విప్పుతున్నారు.
కేశినేని నాని విషయంలో టీడీపీ ఏం చేస్తుంది?
పైస్థాయిలో చెప్పిన విధంగా.. క్షేత్రస్థాయిలో వ్యవహారాలు లేవనే అసంతృప్తి నేతల్లో ఉంది. సమస్యలను పార్టీ అధిష్ఠానం సరిగా అడ్రస్ చేయడం లేదని వారి వాదన. పార్టీలో ముఖ్యులతోపాటు .. 2019లో బలమైన ఫ్యాన్ వేవ్ తట్టుకుని నిలబడిన వారికి చంద్రబాబు, లోకేష్‌లు ప్రాధాన్యం ఇవ్వడం లేదట. పైగా అవమానపరుస్తున్నట్టు కొందరి అభియోగం. ఈ క్రమంలోనే గతంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఇప్పుడు ఎంపీ కేశినేని నాని ఎపిసోడ్ తెర మీదకు వచ్చాయి. బుచ్చయ్యను తిరిగి పార్టీ పట్టాలెక్కించడంలో సక్సెసైన హైకమాండ్.. కేశినేని నాని విషయంలో ఏ చేస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.
రాజకీయాలకు దూరంగా ఉంటానని 6 నెలల క్రితమే చెప్పారట..!
అప్పట్లోనే బుజ్జగింపులు వర్కవుట్ కాలేదట..!
కేశినేని ఎపిసోడ్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది కానీ.. ఇది పాతదేనట. ఆరు నెలల క్రితమే రాజకీయాలకు దూరంగా ఉంటానని చంద్రబాబుకు చెప్పేశారట నాని. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారని స్పష్టం చేశారట. ఎంపీగా పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగుతానని వెల్లడించారట. ఆ సమయంలో నానిని బుజ్జగించేందుకు కొందరు నాయకులను చంద్రబాబు పంపించారట. వారు నానికి నచ్చ చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదట. దీనికి అనుగుణంగానే చంద్రబాబు ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ వచ్చినప్పుడు కూడా నాని చూసీ చూడనట్టుగానే ఉండిపోయారు. ఆ విధంగా నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఇప్పుడు బయటకొచ్చింది.
హైకమాండ్ తీరు మారదని అనుకుంటున్నారా?
గతంలో బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తనపట్ల అవమానకర రీతిలో వ్యవహరించిన బుద్దా వెంకన్న, బొండా ఉమాను మందలించాల్సింది పోయి.. వారిని ఇంకా నెత్తికెత్తుకునే రీతిలోనే పార్టీ ముఖ్యులు వ్యవహరిస్తున్నారని కేశినేని నాని గుర్రుగా ఉన్నారట. దీంతో పార్టీ హైకమాండ్ పద్ధతి మారదనే నిశ్చితాభిప్రాయానికి నాని వచ్చినట్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఇప్పుడు కేశినేని అంశం బహిరంగం కావడంతో బెజవాడ తమ్ముళ్లల్లో ఆందోళన మొదలైందట. అసలే బెజవాడలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఈ టైమ్‌లో నాని సైలెంటైతే పార్టీకి ఇబ్బందులు తప్పవని చెవులు కొరుక్కుంటున్నారట.
నరేంద్రకు బుజ్జగించే పని అప్పగిస్తారట..!
కేడర్‌లో వ్యక్తమవుతున్న ఆందోళనకు అనుగుణంగా టీడీపీ హైకమాండ్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కేశినేని ఎపిసోడ్‌ను ఒక కొలిక్కి తీసుకొచ్చే బాధ్యతను బెజవాడ పార్లమెంట్ ఇంఛార్జ్ ధూళిపాళ్ల నరేంద్రకు అప్పగిస్తారట. అయితే బుచ్చయ్య చౌదరిని బుజ్జగించినంత తేలికగా కేశినేని బుట్టలో పడబోరనే భయం పార్టీ పెద్దల్లో ఉంది. నానిని బుజ్జగించాలన్నా.. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలన్నా బుద్దా వెంకన్న, బొండా ఉమాలపై చర్యల డిమాండే ప్రధాన అజెండాగా ఉంటుంది. మరి.. హైకమాండ్ అందుకు సిద్ధమా? ఆ ఇద్దరి ప్రస్తావన లేకుండా నాని దారికి వస్తారా? టాఫ్ టార్గెటే ఇది.