ఆంద్రప్రదేశ్‌లో రోజురోజుకి రాజకీయ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. పొత్తు, ప్రశ్నాపత్రాల వివాదం, ఎన్నికల వ్యూహాలు.. వంటి అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ను స్టార్ హోటల్‌గా మార్చుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు హైదరాబాద్ వదిలి ఏపీకి రారని అన్నారు.
గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి చంద్రబాబు ఇంకా కోలుకోలేదని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా సమాధి కాబోతోందని తమ్మినేని జోస్యం చెప్పారు. చంద్రబాబు చేస్తోన్న యాత్రలు.. అసమర్థుడి ఆఖరి అంతిమయాత్రలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా పోరాడే దమ్ము లేకపోవడం వల్ల పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని, అయితే తమ సింహం (జగన్) మాత్రం సింగిల్‌గానే వస్తుందని తెలిపారు. తమ పార్టీ క్యాడర్‌లో ఎక్కడా అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.
ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం చేపట్టబోతున్నామని, తమలో ఏమైనా లోపాలుంటే సరిచేసుకుంటామని తమ్మినేని అన్నారు. అర్హత కలిగిన వారికి పథకాలు అందకపోతే, ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమం అందేలా చూస్తామన్నారు. ప్రతిపక్షాలు అపోహాలు సృష్టిస్తున్నాయని, ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన సంక్షేమ పథకాల్ని టంచన్‌గా అందిస్తున్నామని స్పీకర్ తమ్మినేని వెల్లడించారు.