ఏపీ తీరంలో అసని తీవ్ర తుఫాన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. అటు రైల్వేశాఖ కూడా తక్షణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీలో నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించి.. కొన్ని రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేశారు.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేసిన రైళ్లలో విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ రైళ్లు, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్-విజయవాడ, నర్సాపూర్-నిడదవోలు, నిడదవోలు-నర్సాపూర్, భీమవరం జంక్షన్-నిడదవోలు, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-భీమవరం జంక్షన్ రైళ్లు ఉన్నాయి. అంతేకాకుండా కాకినాడ పోర్ట్-విజయవాడ మార్గాల్లో వెళ్లే డెము, మెము సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు. నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు షెడ్యూల్‌ని మార్చారు. నర్సాపూర్ నుంచి బుధవారం ఉ. 11.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు మధ్యాహ్నం 2.05 గంటలకు వెళ్లనుంది. బిలాస్‌పూర్- తిరుపతి, కాకినాడ పోర్ట్-చెంగల్‌పట్టు రైళ్లను నిడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
అటు గుంటూరు-రేపల్లె (07784), రేపల్లె-గుంటూరు (07785), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం (17267), విశాఖపట్టణం-కాకినాడ పోర్ట్ (17268) రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరు-డోన్ (17228) రైలును రీ షెడ్యూల్ చేశారు. ఈ రైలు బుధవారం మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరాల్సి ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
