రాజధాని నిర్మాణంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలి సంతకం రాజధాని నిర్మాణ పనులపైనే అంటూ స్పషీకరించారు. అంతేకాకుండా.. రాజధాని నిర్మాణం మూడేళ్లల్లో పూర్తి చేస్తామని, అధికారంలోకి వస్తే రాజధాని పనుల మీదే బిజెపీ మొదటి సంతకం చేస్తుందని ఆయన వెల్లడించారు. ఒకాయన ఎక్కడికెళ్లినా ఆ మోడల్ కేపిటల్ కడతానంటారు.. మాట తప్పను మడమ తిప్పను అంటూ రాజధానిని విశాఖకు తీసుకెళ్తానంటాడు ఇంకొకాయన.. బీజేపీ అమరావతిలోనే రాజధాని కడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది మోడీ అభివృద్ధి విధానమేనని, దీనిపై ఏ పార్టీతోనైనా చర్చకు నేను సిద్ధమన్నారు.
కూతురు, కొడుకు, మేనల్లుడు పాలన పోతుందని మోడీని దింపేస్తారా కేసీఆర్..? అని ఆయన ప్రశ్నించారు. ఒకాయన కొడుకు సన్నబడ్డాడు.. ఆయన కూడా ఏదో మాట్లాడతాడని సెటైర్లు వేశారు. డ్రైవర్లను చంపేస్తారు.. అధికారులను చెంపదెబ్బ కొడతారు.. అలాంటి వాళ్ళకు 151 సీట్లా..? బీజేపీవి వంద రత్నాలు.. వాళ్ళవి నవరత్నాలు. దమ్ముంటే పోలవరంపై ఏ రాజకీయ నాయకుడైనా మాతో చర్చించవచ్చు అని ఆయన అన్నారు. వైసీపీ అరాచకాలకు బీజేవైఎం అడ్డుకట్ట వేయాలని, బీజేపీ సిద్ధాంత పరమైన పార్టీ, రాజకీయం చాలా పార్టీలకి వ్యాపారం, రాష్ట్రాలన్నిటిని అనుసంధానం చేస్తున్నది బీజేపీనే అని ఆయన తెలిపారు. అయోధ్యలో శ్రీరామ మందిరం ఉండాలి.. బాబర్ కట్టడం ఉండకూడదని ఆయన ఉద్ఘాటించారు.