కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్‌లో విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. రాష్ట్రంలో పార్లమెంట్ పరిధిని జిల్లాలుగా విభజించటం అనాలోచిత నిర్ణయం అంటున్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… పార్లమెంట్ పరిధికి జిల్లా ఏర్పాటుకు సంబంధం లేదన్న ఆయన.. 2026లో దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల పునర్విభజనతో సరిహద్దుల మారతాయని.. అప్పుడు మళ్లీ జిల్లాలను మారుస్తారా..? అంటూ నిలదీశారు… దేశంలో ఏ శాఖలో కూడా పార్లమెంట్ పరిధి ఆధారంగా పరిపాలన జరగదని స్పస్టం చేసిన ఆయన.. పార్లమెంట్ సరిహద్దులను పక్కన పెట్టి జిల్లాల విభజన చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Silpa Chakrapani Reddy: ఆయన సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజు..!
ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖ వంటి 8 జిల్లాల్లో 124 అసెంబ్లీ స్థానాలున్నాయని… కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం వంటి 5 జిల్లాల్లో అసెంబ్లీ స్థానాలు పదిలోపే ఉన్నాయని గుర్తుచేసిన సోమిరెడ్డి.. వీటిని విభజించడం తగదన్నారు.. ఇక, ఆనం రామనారాయణరెడ్డి సహా వైసీపీ నేతలే జిల్లాల విభజనను తప్పుబడుతున్నారని ఆరోపించారు… తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసి కాపీ కొట్టాలనుకుంటే… రైతుబంధు లాంటి పథకాలు కాపీకొట్టండి.. కానీ, జిల్లాల విభజన తగదని హితవుపలికారు.. తెలంగాణలో విఫలమైన జిల్లాల విభజన ఏపీలోనూ అమలు చేయాలనుకోవడం తప్పిదమే అవుతుందన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.