ఏపీ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, రుణాలు అందించి వారికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే ఈ నెల 10వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనున్నది. 229, 230 వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత ఏడాది అక్టోబరు 17 తేదీన ఎస్ఎల్ బీసీ సమావేశం జరిగింది. ఎల్లుండి జరగబోయే సమావేశంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, పీ4 విధానం అమలు అంశాలపై ఎస్ఎల్ బీసీ చర్చించనున్నది.
ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్ధిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్ష, 228 వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ టేకెన్ రిపోర్టు పైన ఎస్ఎల్ బీసీ చర్చించనున్నది. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి లాంటి కేంద్ర పథకాలపైనా సమీక్షించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ డిజిటల్ జిల్లాల అంశంపైనా ఎస్ఎల్ బీసీ చర్చించనున్నది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు.. ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.