Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతుంది. తిరుపతి పోలీస్ అతిథిగృహంలో మరోసారి సిట్ సభ్యులు సమావేశం అయ్యారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్‌పి హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై సిట్ సమగ్ర దర్యాప్తు చేస్తుంది. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి.
Read Also: Game Changer : యంగ్ టైగర్ కొట్టేసాడు.. ఇక రామ్ చరణ్ వంతు..
ఈ సందర్భంగా కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు దగ్గర నుంచి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళతాం అని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో ప్రతి అంశాన్ని విచారిస్తున్నాం.. విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం.. అవసరమైతే మరిన్ని బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ఏఆర్ డెయిరీకి సంబంధించిన పూర్తి వివరాలను టీటీడీ నుంచి తీసుకున్నట్లు తెలిపారు. మరో రెండు రోజులు పాటు ఈ విచారణ కొనసాగుతుందని త్రిపాఠి వెల్లడించారు.