SI Kiran Kumar Arrested In Disha Case For Cheating Homeguard: తమకు ఏదైనా సమస్య వస్తే, న్యాయం కోసం పోలీసుల వద్దకు వెళ్తారు సామాన్య ప్రజలు. అలాంటి రక్షకులే భక్షకులైతే..? అందరూ కాదు కానీ, కొందరు మాత్రం తమ ఖాకీ పవర్‌ని తప్పుడు పనులకు వినియోగించుకుంటుంటారు. తమ చేతిలో అధికారం ఉంది కదా.. ఎవరేం చేయలేరులే అనే ధీమాతో పాడుబుద్ధులు చూపిస్తుంటారు. అలాగే ఓ ఎస్ఐ పాడుబుద్ధి చూపించగా.. అతనికి తగిన బుద్ధి చెప్పింది ఒక మహిళా హోంగార్డ్. తనని మోసం చేసిన అతడ్ని కటాకటాల వెనక్కి పంపింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కృష్ణా జిల్లా బంటుమిల్లిలో కొమ్మా కిరణ్‌కుమార్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను బందరు సబ్‌జైలులో పని చేస్తున్న మహిళా హోంగార్డుతో పరిచయం పెంచుకున్నాడు. క్రమంగా సాన్నిహిత్యం పెరగడంతో.. సహజీవనం చేయసాగారు. నాలుగేళ్ల పాటు వీళ్లు సహజీవనం చేశారు. ఈ క్రమంలో కిరణ్‌కుమార్ ఆమె వద్ద నుంచి కొన్నిసార్లు డబ్బులు కూడా తీసుకున్నాడు. ‘నా ప్రియుడే కదా, అవసరమైనప్పుడు తిరిగిస్తాడులే’ అనుకొని.. అతడు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చింది. కట్ చేస్తే.. ఇటీవల ఇంటి అవసరాల కోసం ఆమె కిరణ్‌ను డబ్బులు అడిగింది. అతడు ఇవ్వనన్నాడు. తనకు డబ్బు అత్యవసరమని, కొంత మొత్తం ఇవ్వమని ఎంత వేడుకున్నా ఇవ్వలేదు. చివరికి.. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించాడు.
ఆ ఎస్ఐ బెదిరింపులతో ఆ మహిళ హోంగార్డు తీవ్ర మనస్తాపానికి గురైంది. తన సర్వస్వంతో పాటు డబ్బులు కూడా ఇచ్చిన వ్యక్తి ఛీదరించడంతో తట్టుకోలేకపోయింది. దీంతో.. అతనికి తగిన బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకొని, ‘స్పందన’లో ఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ.. వెంటనే ఎస్ఐ కిరణ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని ‘దిశ’ పోలీసుల్ని ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు.. కేసు నమోదు చేసి, 24 గంటల్లోనే కిరణ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలించారు.