NTV Telugu Site icon

Sariya water Fall: మృత్యుకుహరంగా సరియా వాటర్ పాల్

Danger

Danger

అల్లూరిసీతారామరాజు జిల్లాలో జలపాతాలు పర్యాటకులకు ఒకవైపు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంటే అక్కడికి వెళ్ళినవారు మరణించడంతో విషాదం నెలకొంటోంది. సరియా జలపాతం టూరిస్టుల పాలిట మృత్యుకుహరంగా మారింది. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని సరియా జలపాతం ప్రమాదభరితంగా మారింది. మంగళవారం సరియా జలపాతానికి విహారానికి వచ్చిన విశాఖకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

వారి మృతదేహాలను అనంతగిరి పోలీసులు ఎట్టకేలకు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విశాఖ జగదాంబ సమీపంలోని ఎల్లమ్మతోట ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సరియా జలపాతం సందర్శించేందుకు వచ్చారు. వారిలోదుక్కసాయి 39 ప్రమాదవశాత్తూ జలపాతంలో జారిపడగా తనను రక్షించే ప్రయత్నంలో చైతన్య అనే 17 ఏళ్ళ యువకుడు కూడా అందరి కళ్లముందే గల్లంతయ్యాడు. దీంతో ఆందోళనకు గురైన మిగిలిన ఇద్దరు స్నేహితులు సమీపంలోని దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌ కి వెళ్లి ఫిర్యాదు చేయగా రాత్రి సమయం కావడంతో ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదు.

బుధవారం వేకువ జామున అనంతగిరి పోలీసులు గజ ఈతగాళ్లుతో మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను ఒడ్డుకుచేర్చి, అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సరియా జలపాతంపై పోలీసులు స్థానికులు పలు హెచ్చరికలు సూచనలు చేస్తున్నప్పటికీ తరచూ పర్యాటకులు జలపాతంలో మృత్యువాతకు గురవుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినప్పటికీ పర్యాటకులు వాటిని పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు గురై వారి కుటుంబాలను శోకసంద్రంలో ముంచుతున్నారు.

ఇప్పటికే సరియా జలపాతంలో పదులసంఖ్యలో పర్యాటకులు మృత్యువాతకు గురయ్యారు. ముఖ్యంగా యువకులే ఈప్రమాదంలో ఎక్కువగా చనిపోతున్నారు. కావున ఇప్పటికైనా తల్లిదండ్రులు వారి పిల్లలను సరియా జలపాతాన్ని సందర్శనకు పంపించే విషయంలో తగుజాగ్రత్తలు తీసుకుంటే జలపాతంలో ప్రమాదాలను నివారించవచ్చు. ఈప్రమాదంలో చనిపోయిన సాయికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖలో చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాడు. చైతన్య ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

Dsp Died: శిల్పకళావేదికలో అపశృతి.. డిఎస్పీ క్యాడర్ అధికారి దుర్మరణం