Sankranti 2023: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రోజువారీ సర్వీసుల్లో సీట్లన్నీ నిండిపోయాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించినా..సీట్లు, బెర్త్‌లు దొరక్కపోవడంతో కుటుంబాలతో కలిసి వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి సుమారు 12 లక్షల మందికిపైగా సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో ముందస్తుగా వేలాది మంది సొంతూళ్లకు పయనం కావడంతో బస్సులన్నీ నిండుగా బయలుదేరివెళ్లాయి.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
సంక్రాంతి అసలు రద్దీ మంగళ, బుధవారం నుంచి ప్రారంభమవుతుందన్న అంచనాలతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే 3 వేల 500 బస్సులకు అదనంగా 4 వేల 233 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్టు టీఎస్‌ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఏపీఎస్‌ఆర్టీసీ సైతం రోజూ నడిపే 500 సర్వీసులకు తోడుగా మరో 1,850 బస్సులను ఏర్పాటు చేసింది. ఇక.. రోజూ 4 నుంచి 5 వేల బస్సులను నడిపేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు కసరత్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేస్తుండగా.. ప్రైవేట్ బస్సులు మాత్రం దర్జాగా రెండు-మూడింతల మేర చార్జీలు పెంచి వసూలు చేస్తున్నాయి. సంక్రాంతికి సొంతూరికి వెళ్లాలన్న కుతూహలంతో చాలా మంది ప్రయాణికులు రెండు, మూడింతల చార్జీలు చెల్లించి మరీ.. ప్రైవేట్ బస్సుల్లో వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. సొంత కార్లలో ఊరికి వెళ్లడానికి మధ్య తరగతి, ఐటీ ఉద్యోగ కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే అన్ని రూట్లు రద్దీగా మారిపోయాయి.
