జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టితో మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై జగన్ ఫోకస్ పెట్టనున్నారు. మూడేళ్ళ పాలనా సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు. తాడేపల్లి పార్టీ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడతారు. వీటికి సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి, ఇతర నేతలు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు సంబరాలు నిర్వహించనున్నారు.
బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయబోతోందన్నది ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర ఆదివారం నాడు ముగిసింది. ఓవైపు సంక్షేమాన్ని వివరిస్తూనే… విపక్షాలపై విసుర్లతో విరుచుకుపడ్డారు మంత్రులు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శ్రీకాకుళంతో మొదలై అనంతపురంతో ముగిసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పధకాల్ని 4 రోజుల పాటు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు మంత్రులు. అడగడుగునా సంప్రదాయ రీతిలో స్వాగతాలు లభించాయి. 17 మంది మంత్రులు ఒకేచోట కనిపించడం విశేషం.
పలు జిల్లాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రధానంగా సంక్షేమంపైనే ఫోకస్ చేస్తూ… గతంలో ఏం ఒరిగింది? ఇప్పుడు ఏం జరిగింది? అనే విషయం చెప్పుకొచ్చారు మంత్రులు. మరోవైపు మహానాడులో టీడీపీ చేసిన విమర్శలకు కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ హయాంలో కేవలం ఆ పార్టీ కార్యకర్తలకే పధకాలు అందాయని… జగన్ పాలనలో పార్టీలు, కులాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తు చేశారు. అటు వైసీపీ హయాంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చంద్రబాబు అంటే… అదే స్థాయిలో మంత్రులు కూడా విరుచుకుపడ్డారు. బాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నదానికి అంతే లేదని… ఆయన కుట్రల్ని తిప్పికొట్టాలని మంత్రులు పిలుపునిచ్చారు.
‘టీడీపీది మహానాడు కాదని… వెన్నుపోటు నాడు, మహాస్మశానం, ఏడుపునాడు, దగా నాడంటూ మండిపడ్డారు మంత్రులు. నవరత్నాల పథకాలతో సీఎం జగన్.. పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చారన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన బాబు మళ్లీ అధికారంలోకి రావడం కలేనని జోస్యం చెప్పారు మంత్రులు. ఇలా శ్రీకాకుళంలో ప్రారంభమైన మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర అనంతపురంలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. ఓవైపు సంక్షేమాన్ని ప్రస్తావిస్తూనే… ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విమర్శల దాడి చేసిన మంత్రులు… ఈ టూర్ సక్సెస్ అయిందన్న భావనలో ఉన్నారు. దీనిపై సీఎం జగన్ కి వివరించాక తదుపరి కార్యాచరణకు దిగనున్నారు మంత్రులు. రాబోయే రోజుల్లో పార్టీని మరింతగా జనంలోకి తీసుకెళ్ళనున్నారు.