Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం

  • స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆరోపణలు
  • నామినేషన్ల అడ్డగింతపై సజ్జల ప్రశ్నలు
  • జగన్ పర్యటనలపై ఆంక్షలంటూ విమర్శలు
  • చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత కౌంటర్
Sajjala

Sajjala

అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నప్పటికీ, రాష్ట్రంలో టీడీపీ నేతలు అరాచకాలు, దాష్టీకాలు, దమనకాండ సాగిస్తున్నారని ఆరోపించారు. బైండోవర్ కేసుల నుంచి ఏకంగా హత్యాయత్నం కేసుల వరకు తమ పార్టీ నేతలపై బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల ప్రక్రియలో అరాచకాలు.. నామినేషన్ల అడ్డుగింపు

మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల స్క్రూటినీ దశలోనే అరాచకాలు మొదలుపెట్టారని సజ్జల ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ లోపల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వమని అడగడానికి భయపడుతున్నారని, తమ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను ఇప్పటికే చూపించామని స్పష్టం చేశారు. నామినేషన్లు మొత్తం వాళ్లవే ఎందుకు కనిపిస్తున్నాయి, తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. తాము ఎక్కడ అడిగినా కేవలం నామినేషన్లు వేయనివ్వాలని మాత్రమే కోరామని తెలిపారు. చంద్రబాబు రాయలసీమ నుంచే వచ్చానని మర్చిపోయి అసత్యాలు మాట్లాడుతున్నారని, ఆయనకు తెలిసిన విద్య తడిగుడ్డలతో గొంతులు కోయడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర కౌంటర్

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ అంశంపై మాట్లాడినా పక్కా సాక్ష్యాధారాలతోనే మాట్లాడుతారని సజ్జల స్పష్టం చేశారు. ఎలాంటి సబ్జెక్ట్ లేకపోయినా గంటలకొద్దీ మాట్లాడే వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో బాధ్యమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు వారంలో మూడు రోజులు హైదరాబాద్‌లోనే గడుపుతారని, కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ మాత్రం బెంగళూరు వెళ్లకూడదంటూ నిబంధనలు పెడతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడికైనా ఊరేగవచ్చని, సమాచారం కూడా ఇవ్వకుండా విదేశాలకు వెళ్లవచ్చని.. కానీ జగన్ ఎక్కడికి వెళ్లకూడదంటూ ఆంక్షలు పెడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ఇంకా అధికారంలోనే ఉన్నట్లు చంద్రబాబు భావిస్తున్నారా అని ఎగతాళి చేశారు. ఇవాళ దాడులన్నీ తమ వాళ్లే చేశారంటూ చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్నారని, సంస్కారహీనంగా దిగజారి మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.