Sajjala Ramakrishna Reddy: వికేంద్రీకరణపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు అభ్యంతరాలు దాటి ఈ ఏడాదిలోనే విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వైజాగ్ నుండి పరిపాలన ప్రారంభిస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారని.. ఇప్పుడు ఎన్నికలు దగ్గరలో లేవు కాబట్టి తన క్యాడర్‌ను కాపాడుకోవడానికి త్వరలో ఎన్నికలు వస్తున్నాయంటూ చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఆయనకు ప్రజల్లో బలం లేదని.. ఇంకో నటుడి వల్ల ఓట్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.
పవన్ ఉంటేనే నాయకులు నిలబడతారనే భ్రమలో ఉంచుతున్నారని.. బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరినీ కలిపి జగన్‌ను అధికారంలో నుంచి దించాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల ఆరోపించారు. ప్రజల్లో లేని నాయకుడు అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. మూడు రాజధానులను తమను గెలిపించే ఎజెండాగా తాము చూడటం లేదని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పరిపాలనను వికేంద్రీకరిస్తున్నామని తెలిపారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి నిర్మాణంలో అధిక నిధులు ఖర్చు పెట్టలేక సమగ్రాభివృద్ధి అని మూడు రాజధానులు అంటున్నామన్నారు. వేల కోట్లు రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించాలనుకున్న చంద్రబాబు బినామీల ఆలోచనలు సాధ్యం కాలేదన్నారు.
Read Also: Gudivada Amarnath: అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదు.. దండయాత్ర
చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కనీసం కరకట్ట వేయలేకపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నాడని.. గత మూడున్నరేళ్లలో తాము ప్రజాస్వామ్య విలువలు పెంచామని గుర్తుచేశారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు అవసరమన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టి తీరుతామన్నారు. బండ బూతులు తిట్టే రాజకీయ నాయకులకు వైసీపీ యువత బుద్ధి చెప్పాలన్నారు. యువత అసభ్య పదజాలం వాడొద్దని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. జగన్ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు పనిచేయాలన్నారు. తప్పుడు మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దన్నారు. ప్రజలు తమ ఇంట్లో మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక నిధులు విడుదల చేశామని.. గతంలో విదేశీ విద్య దుర్వినియోగం అయ్యిందన్నారు.
