NTV Telugu Site icon

Sajjala: మా ప్రభుత్వం రూపాయి కూడా వేస్ట్ చేయడం లేదు.. పరిపాలనలో జగన్ ఒక రోల్‌మోడల్

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala: ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షం టీడీపీ మాయల‌మరాఠీగా మీడియా మొత్తాన్ని‌ గుప్పిట్లో పెట్టుకుని అబద్దాలను‌ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ ఒక మోడల్‌గా నిలిచారని సజ్జల అన్నారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని 2019 వరకు అధికారంలో ఉన్న వ్యక్తి అనలేదా అని ప్రశ్నించారు. ఇపుడు అదే వ్యక్తి తన చంద్రన్న కానుక, విదేశీ విద్యను ఎందుకు అమలు చేయరని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ పార్టీ డీఎన్ఏలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని స్పష్టం చేశారు. విద్య, వైద్యం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగేలా వైఎస్సార్ హయాంలో అడుగులు పడ్డాయని.. పేదవాడు పేదవాడిగానే ఉండాలనేది గత పాలకుల ఆలోచన అని ఆరోపించారు. బహుజనుల‌ పేరు చెప్పుకుని వచ్చిన‌ పార్టీలు సైతం అదే దారిలో వెళ్లాయన్నారు.

Read Also: Vamsi Paidipally: ఎవడ్రా సీరియల్ ను తక్కువ చేసి మాట్లాడింది.. మీకు తెలుసా వారి కష్టం

నేటికీ పార్లమెంట్‌లో మహిళా బిల్లుని రానివ్వరని సజ్జల విమర్శలు చేశారు. కానీ సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు‌ 50 శాతం రిజ్వేషన్లు అమలు చేశారని స్పష్టం చేశారు. అందులోనూ 50 శాతం‌ మహిళలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. సీఎం వైఎస్ జగన్ తన‌ నిర్ణయంతో బెంచ్ మార్కుగా మార్చారని… ఇంతకంటే ఎవరూ తక్కువ రిజర్వేషన్లు ఇవ్వలేరని సజ్జల అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందికి న్యాయం జరుగుతుందని భావిస్తే సంతకం చేయడానికి సీఎం జగన్ వెనుకాడరని.. ఆయనకు తెలుగుపై మమకారం ఉందన్నారు. పులివెందుల‌బిడ్డ అచ్చ తెలుగులో మాట్లాడగలరని.. ఇంగ్లీష్‌పై మోజుతో‌ తెలుగుపై కోపంతో ఇంగ్లీష్ మీడియం‌ పెట్టలేదు…అవసరం అయి పెట్టారుఅంతర్జాతీయ స్ధాయిలో విద్యార్ధులు రాణించాలని ఇంగ్లీష్‌ను ప్రోత్సహించారన్నారు. టాప్ వంద యూనివర్సిటీలలో పేద విద్యార్ధులు సీటు తెచ్చుకుంటే ఎన్ని ‌కోట్లైనా ప్రభుత్వమే భరిస్తోందన్నారు.

గత ప్రభుత్వం విదేశీ విద్య పేరుతో అరకొరగానే నిధులు ఇచ్చిందని సజ్జల ఆరోపించారు. బలహీనవర్గాల కుటుంబాలలో‌ మార్పు తీసుకురావడానికే విద్యకు ఇంత పెద్దపీట వేస్తున్నారని.. ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మేలుని‌ అన్ని వర్గాలకి తెలియజెప్పాలన్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని.. అధికారం అనేది సేవ అని.. ప్రజల జీవితాలలో మార్పు తీసుకొచ్చే బాధ్యత అని సీఎం వైఎస్ జగన్ విశ్వసిస్తున్నారని తెలిపారు. జగన్‌ను అధికారంలో‌ కొనసాగించడం బలహీనవర్గాలకు అవసరమని అభిప్రాయపడ్డారు. గతంలో దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం చేశారని.. కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఒప్పందాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. మభ్యపెడుతున్న ప్రతిపక్షాలను తిప్పికొట్టాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎపుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగుల యూనియన్‌లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేవారని.. ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమని వైఎస్ జగన్ చూస్తున్నారన్నారు. ఉద్యోగులు లేకుండా ఏమీ చేయలేమన్నారు. లక్ష్యాన్ని చేరువ కావడానికి చిత్తశుద్ధితో పని చేయాలని.. అందరి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలున్నాయని.. కానీ ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి సరైన మార్గంలోనే వెళ్తున్నాయని.. ఒక్క రూపాయి కూడా తమ ప్రభుత్వం వేస్ట్ చేయటం లేదన్నారు.