Tirupati: తిరుపతిలోని రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలో పనుల జాప్యంపై వరుసగా ఫిర్యాదులు అందడంతో, కలెక్టర్ స్వయంగా అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ముఖ్యంగా క్రయ- విక్రయ పత్రాల రిజిస్ట్రేషన్లలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. అయితే, ఫైళ్ల రిటర్న్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు కలెక్టర్ దృష్టికి వచ్చింది. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జిల్లాలో అత్యధిక ఆదాయం వచ్చే కార్యాలయంగా గుర్తింపు పొందినదని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్కెట్ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు వెల్లడించారు.
అయితే, రోజుకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ, సిబ్బంది కొరతతో పాటు సాంకేతిక లోపాల కారణంగా జాప్యం జరుగుతోందని అధికారులు కలెక్టర్ వెంకటేశ్వర్లకు తెలిపారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆలస్యం, అధిక ఫీజులు, ఆన్‌లైన్ లోపాలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. స్లాట్స్ బుకింగ్, డాక్యుమెంట్ల స్కానింగ్, రిజిస్ట్రేషన్ విధానంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సర్వర్ పనితీరును మెరుగుపర్చాలని, సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
ఇక, ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా సమయపాలన పాటించాలని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైన చోట అదనపు సిబ్బంది, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
