తిరుమలలో త్వరలోనే శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భక్తుల అనుమతి ఎప్పుడనేది ఆధికారులు ఏర్పాట్లు చేశాక ప్రకటిస్తామని తెలిపారు. తిరుమలలో సామాన్యుడి నుంచి వీఐపీల వరకు అందరికీ ఒకే రకమైన అన్నప్రసాదం అందిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుందన్నారు. తిరుమలలో ప్రైవేట్ హోటళ్లు పూర్తిగా తొలగిస్తామన్నారు. హోటళ్లు లేకుండా భక్తులకు ఉచితంగా భోజనం అందించేలా చర్యలు చేపడతామన్నారు.
తిరుమలలో అన్ని ప్రాంతాలలో అన్నప్రసాదం ఉండేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అన్నప్రసాదం భవనంలో భోజనం తయారు చేసేందుకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అటు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాక మూడో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తిస్థాయిలో సర్వదర్శనాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు రూ. 25 కోట్ల మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.2.73 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరణ పనులు చేపడతామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.