ఇవాళ శ్రీశైలంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శంచుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆలయ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు రాష్ట్రపతి ముర్ము..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఇలా..!
హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 11:45 గంటలకు సున్నిపెంట చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం ఆలయానికి వెళ్లే రోడ్డులో సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం నేరుగా భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు వెళతారు. ఆ తర్వాత ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను రాష్ట్రపతి దర్శించుకుంటారు. ఉభయ ఆలయాల్లో మల్లికార్జున స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన పూజలు రాష్ట్రపతి నిర్వహించనున్నారు.
స్వామి అమ్మవార్ల దర్శనా నంతరం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో రాష్ట్రపతి భోజనం చేస్తారు. అనంతరం నంది సర్కిల్ కు చేరుకుంటారు.కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రసాద్ స్కీం కింద 47 కోట్లతో దేవస్థానం పరిధిలో నిర్మించిన సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ ( సీఆర్వో ) ను, యాంపీ థియేటర్, ఆడియో విజువల్ డిస్ప్లే ఆఫ్ టూరిజం ప్రాజెక్ట్స్ ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన గిరిజన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.
అక్కడ నుంచి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు తిరిగి సుండిపెంట హెలిప్యాడ్ వద్దకు వెళ్లి ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి హైదరాబాద్ కు బయలుదేరుతారు.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటు మొత్తం 1500 మంది పోలీసు లతో భద్రతా చర్యలు చేపట్టారు.రాష్ట్రపతి పర్యటన పురస్కరించుకొని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్య నారాయణతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీశైలం వచ్చి రాష్ట్రపతిని కలవనున్నారు.రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Read Also: Social Media: చంద్రబాబు, జగన్‌లను అధిగమించిన పవన్ కళ్యాణ్.. కానీ..?