జిల్లాల పునర్విభజన ఆ మంత్రులిద్దరికీ తలనొప్పులు తెస్తోందా? విపక్షాల విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిళ్లు.. సీఎంకు ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారా? తరుణోపాయం తోచడం లేదా? ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రులెవరు?
జిల్లా విభజన మార్పుకోసం మంత్రులపై ఒత్తిళ్లు
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్. ఇద్దరిలో ఒకరు సీఎం జగన్‌కు దగ్గరి బందువు.. మరొకరు ఆయనకు ఆత్మీయంగా ఉండే సహచరుడు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ప్రకాశం జిల్లా మూడు ముక్కలైంది. దీనిపై జిల్లావాసుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ఒంగోలు కేంద్రంగా ఉండే ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఆప్రాంత ప్రజలతోపాటు వైసీపీ నేతలు మంత్రి బాలినేనిపై ఒత్తిడి తెస్తున్నారు. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా చేయాలని పశ్చిమ ప్రాంత అధికారపార్టీ నాయకులు మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఊపిరాడనీయటం లేదు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాను మార్కాపురం, ఒంగోలు కేంద్రాలుగా రెండు జిల్లాలు చేయాలన్న ప్రతిపాదన మరికొందరిది. దీంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌ల డిమాండ్స్‌కు అనుగుణంగా జైకొట్టగా తప్పని పరిస్థితి ఉందట.
బాలినేనికి తలనొప్పిగా మారిన ‘కందుకూరు’
ఇప్పటికే కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు మహీధర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబుతోపాటు అద్దంకి ఇంచార్జి కృష్ణచైతన్య తమ ప్రాంత ప్రజాప్రతినిధులతో వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. మిగతా ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లు కూడా వాస్తవ పరిస్దితులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారట. కందుకూరు డివిజన్ విషయంలో హామీ ఇవ్వగలను కానీ.. నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగింపుపై ఏం చెప్పలేనని తనను కలిసిన వారికి మంత్రి బాలినేని వివరిస్తున్నట్టు సమాచారం. అద్దంకి, కందుకూరు నేతల ఒత్తిళ్లు బాలినేనికి తలనొప్పిగా మారాయట.
మంత్రి సురేష్‌కు మార్కాపురం సెగలు
మంత్రి ఆదిమూలపు సురేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని కోరుతూ జేఏసీ నేతలు చేస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మార్కాపురంలో మంత్రి సురేష్ ఇంటిని ముట్టడించారు. పర్యటనకు వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కారును అడ్డుకున్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి, రాంబాబులు తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు వస్తుండగా కనిగిరి, దర్శి ఎమ్మెల్యేలు బుర్రా మధుసూధన్ యాదవ్, మద్దిశెట్టి వేణుగోపాల్‌లు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. దీంతో ప్రత్యేక డిమాండ్ వినిపిస్తున్న మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నేతలను సముదాయించడం సురేష్‌కు సవాల్‌గా మారిందట.