వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తైతే దశాబ్దాల కరవు పోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం దోర్నాల మండలం గంటావానిపల్లిలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘అభివృద్ధి జరగాలని నేను మొదటి నుంచి ఆలోచిస్తున్నాను. అభివృద్ధి జరగాలంటే కొంత మంది భూములు కోల్పోతున్నారు. నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ.
నీళ్లు లేక చాలా మంది ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరు. రాయలసీమ, మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలని ఎన్టీఆర్ ఆలోచన చేశారు. 1996 మార్చి 26న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాం. రూ.900 కోట్లు పునరావాసం కోసం కేటాయించాం. రూ.300 కోట్లు మొదటి విడతలో నిర్వాసితులకు ఇస్తున్నాం.’’ అని తెలిపారు.
‘‘రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అధః పాతాళానికి వెళ్లింది. నక్సలిజంపై నేను పోరాటం చేశాను. నాపై బాంబులు పెడితే వెంకటేశ్వరస్వామి నన్ను కాపాడారు. గత పాలకులు రూ.10 లక్షల కోట్లు అప్పులు ఇచ్చారు. అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం చిరస్మరణీయం. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను ప్రజలు అభివృద్ధి కోసం త్యాగం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల భవిష్యత్తును మార్చబోతోంది. ప్రకాశం, మార్కాపురం నెల్లూరు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలకు ప్రయోజనం. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తీవ్ర తాగునీటి సమస్య. ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. మార్కాపురం ప్రాంతం దశాబ్దాలుగా కరవుతో తీవ్ర ఇబ్బందులు పడింది. కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఒకప్పుడు ఎవరూ ఊహించలేదు. వెలిగొండ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో చారిత్రాత్మక మార్పు తీసుకురానుంది.’’ అని చెప్పుకొచ్చారు.
‘‘వెలిగొండ ప్రాజెక్టు పూర్తైతే సాగు, తాగునీరు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. బాధితులకు న్యాయం చేస్తూనే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా. వెలిగొండ నిర్వాసితులకు 3,351 కుటుంబాలకు రూ.300 కోట్లు జమ అయ్యాయి. నిర్వాసితుల త్యాగం వృథా కాదు. అందరికంటే మెరుగైన జీవితం కల్పిస్తాం. వెలిగొండ ప్రాజెక్టుపై ఈ టర్మ్‌లో రూ.3,900 కోట్ల వ్యయం. 2027 నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తాం.. ఫేజ్-1, ఫేజ్-2 పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇడుపూరు, గోగులదిన్నే, తోకపల్లి తదితర పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేస్తాం.’’ అని హామీ ఇచ్చారు.
‘‘మార్కాపురానికి ప్రత్యేక జిల్లా ఇచ్చాం. కలెక్టరేట్ కూడా పునరావాస కాలనీ పక్కనే వస్తుంది. పునరావాస కాలనీ భవిష్యత్తులో ఆదర్శ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందుతుంది. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు. 43.5 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకొస్తాం. సుంకేసుల, గొట్టిపడియ డ్యామ్‌లకు రూ.120 కోట్ల పరిపాలనా అనుమతి. సుంకేసుల గ్యాప్ పనులకు రూ.98 కోట్లతో పనులు ప్రారంభం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యమైంది. పదేళ్ల ముందే ప్రాజెక్టు పూర్తై ఉంటే రైతుల జీవితాలు మారిపోయేవి.’’ అని అన్నారు.
‘‘ఎన్నికల ముందు డ్రామాలు, మోసాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారు. డిజిటల్ అరెస్ట్ మోసాల తరహాలో వైసీపీ మోసాలు. 2024లో కేటాయించిన నిధులను గత ప్రభుత్వం సరిగా వినియోగించలేదు. టన్నెల్-2లో యంత్రం చిక్కుకుపోయినా తొలగించకుండా ప్రారంభోత్సవం చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగనివ్వం. బాధిత రైతులందరికీ న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. వెలిగొండ ప్రాజెక్టుతో నాలుగు జిల్లాల అభివృద్ధి, భూముల విలువ పెరుగుతుంది. ప్రతి నిర్వాసిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తాం. వెలిగొండ పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాం. మార్కాపురం జిల్లాకు కరవు పరిస్థితులు తెలిసిన కలెక్టర్‌ను నియమించాం. ఈ ప్రాంతంలో హార్టికల్చర్‌కు పెద్దపీట వేస్తాం.. మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం. హార్టికల్చర్ అభివృద్ధికి రూ.1 లక్ష కోట్ల ప్రణాళిక. రూ.40 వేల కోట్లు ప్రభుత్వం, రూ.60 వేల కోట్లు ప్రైవేట్ పెట్టుబడులు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో స్థానిక యువతకు ఉద్యోగాలు. ఎఫ్‌పీఓల ద్వారా రైతుల ఆదాయం పెంచే చర్యలు. రామాయపట్నం పోర్టు, ఎయిర్‌పోర్ట్‌తో ఎగుమతులకు అవకాశం. రోడ్లు, రైల్వే కనెక్టివిటీతో ప్రాంత అభివృద్ధి వేగవంతం. అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం. మైక్రో ఇరిగేషన్‌కు మళ్లీ ప్రోత్సాహం. సాగునీటి ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు ఖర్చు చేశాం. హంద్రీ-నీవా పూర్తి చేసి చివరి ప్రాంతాలకు నీళ్లు అందించాం. పోలవరం ఆలస్యం వల్ల రాష్ట్రానికి భారీ ఆర్థిక భారం పడింది. అమరావతిని నిలిపివేయడం రాష్ట్రానికి నష్టం. 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు.’’ అని తెలిపారు.
‘‘అమరావతి రాజధానిగా ముందు ఒప్పుకున్నారు. ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వాళ్లది మొత్తం విధ్వంసం. గొడ్డలి పార్టీకి అభివృద్ధి పట్టదు. రాజధాని రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకం. తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం. తెలంగాణను నేను అభివృద్ధి చేశా.. అక్కడ ఇప్పుడు ఎకరా భూమి రూ.200 కోట్లు దాటింది. వెలిగొండ ప్రాజెక్టుతో రైతుల జీవితాలు మారతాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. కులం, మతం ఆధారంగా కాకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. తెలుగుదేశం ప్రభుత్వంలోనే మార్కాపురం అభివృద్ధి జరిగింది. తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మతులతో నీటి వృథా అడ్డుకున్నాం. 33 కొత్త గేట్లను ఏర్పాటు చేసి ముగ్గురు ముఖ్యమంత్రులం జాతికి అంకితం చేశాం. గంగా, కావేరి నదుల అనుసంధానం అవసరం. దేశంలో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థతో విద్యుత్ కొరత సమస్య తగ్గింది. సెల్‌ఫోన్ విప్లవం వల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. రైతుల్లో అభివృద్ధి దిశగా ఆలోచనా విధానం మారాలి. 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తాం. అక్కడి నుంచి నల్లమల సాగర్‌కి నీళ్లు తీసుకువస్తాం. అవసరమైతే నల్లమల సాగర్ నుంచి లిఫ్ట్ పెట్టి కావేరికి కూడా నీళ్లు ఇవ్వొచ్చు. దీని వలన ఐదు నదులు అనుసంధానం అవుతాయి. నాలుగు రాష్ట్రాలు బాగుపడతాయి. మార్కాపురం జిల్లా అభివృద్ధి చేసే బాధ్యత నాది.’’ అని హామీ ఇచ్చారు.
‘‘రాజకీయం వైకుంఠపాలి లాంటిది. ఒకసారి ఇస్తున్నారు.. మరోసారి పడేస్తున్నారు. మీ కంటికి కనిపించే నాయకుల్ని చూడొద్దు. నన్ను చూడండి.. పార్టీని చూడండి. ఎన్డీయే కూటమిని చూడండి. మీ ఆమోదం లేక పోతే ఎవరినీ నేను ఆమోదించను. అందరూ ఆమోదించే వ్యక్తి దొరకడం కూడా కష్టమే. పోలవరం నిర్వాసితులు త్యాగం చేశారు. అందుకే ఒకే నియోజకవర్గానికి ఒక జిల్లా ఇచ్చాను. వెలిగొండ ప్రాజెక్టు రైతులకు కూడా న్యాయం చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టు రైతులు రాష్టానికి ఆదర్శం.’’ అని చంద్రబాబు కొనియాడారు.

