Site icon NTV Telugu

Ponds Controversy: ఎండపల్లిలో చెరువుల వివాదం .. టెన్షన్ టెన్షన్

Ponds Godava

Ponds Godava

కాకినాడ జిల్లా ఎప్పుడూ ఏదో అంశంపై హైలైట్ అవుతూ వుంటుంది. యు.కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామ శివారులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 4గ్రామాలకు సరిహద్దులో ఉన్న సర్వే నంబర్ 627/ 1,2 మరియు 628/1,2 లలో 52 ఎకరాల పాత, కొత్త చెరువు భూములలో వివాదం నెలకొంది. ఎండపల్లి, ఇసుకపల్లి, కొండెవరం, జొన్నల గరువు గ్రామాలకు చెందిన 100మందికి పైగా రైతులు గత కొన్నేళ్ళుగా ఆ చెరువులో ప్రభుత్వ పోరంబోకు భూమిని సాగు చేసుకుంటున్నారు. కాగా చెరువు భూములు తమ పూర్వీకులకు చెందినవి అని యూ.కొత్తపల్లికి చెందిన రావు వెంకట సూర్యారావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

కొన్నాళ్లుగా కోర్టు పరిధిలో నడుస్తున్న చెరువు భూముల వివాదంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చిందంటూ భూ యజమాని వర్గం పోలీసులు సహాయంతో అక్కడ చెట్లు నరికేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని నాలుగు గ్రామాలకు చెందిన రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న చెరువు భూములకు పంచాయతీలో పన్నులు కూడా కడుతున్నామని, ఇప్పడు అకస్మాత్తుగా వెల్లగొడుతున్నారని వాపోతున్నారు. రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై గతప్రభుత్వంలో రికార్డులు తారుమారు చేసి, ఇప్పుడు తప్పుడు డాక్యుమెంట్లుతో భూములు కాజేస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతులు నిరసనకు దిగగా వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే అక్కడ సాగు చేసుకుంటున్న రైతులు మాట్లాడుతూ చెరువు భూములను కబ్జా చేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు జీవనాధారంగా ఉన్న భూములను లాగేసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. దీనికి అధికారులు ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.

Breaking News : నేటి నుంచి షూటింగ్‌లు బంద్‌.. షూటింగ్‌లకు హాజరుకాని సినీ కార్మికులు

Exit mobile version