కుప్పంలో మున్సిపల్ ఎన్నికల వార్ హీటు పెంచుతుంది.. మాజీ సీఎం, టీడీపీ అధినేత సొంతం నియోజకవర్గం కావడం.. వైసీపీ ఆ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో మున్సిపల్ వార్ హీట్ పెంచుతుంది.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది.. కుప్పంలోనూ అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని దీమాతో ఉంది.. దీంతో.. సొంతగడ్డపై చంద్రబాబుకి మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అటు తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని సీన్‌లోకి దింపారు మంత్రి పెద్దిరెడ్డి. ఇప్పుడు పరిస్థితి చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అన్నట్లుగా మారింది. 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో ఇప్పటికే 125 నామినేషన్లు దాఖలు కాగా.. ఇవాళ్టితో నామినేషన్ల స్వీకరణకు తెరపడనుంది.. ఇవాళ కూడా భారీ సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, నామినేషన్‌ల ప్రక్రియ పూర్తయ్యాక కుప్పంలోనే మకాం వేయాలని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుండగా.. ఈరోజు కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్ఆరు.. మరోవైపు కుప్పం మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.. మంత్రి పెద్దిరెడ్డిపై నిన్న చంద్రబాబు ఘాటైన విమర్శలు చేయగా.. చంద్రబాబుకు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కౌంటర్ అటాక్ చేశారు.. పెద్దిరెడ్డి పుడింగో కాదో కుప్పం ఎన్నికల్లో చంద్రబాబుకు తెలుస్తుంది అంటూ కౌంటర్ ఇచ్చారాయన.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి పై పైచెయ్యి సాధించలేకపోయారన్న ఆయన.. యూనివర్సిటీ నుంచే పెద్దిరెడ్డి ఏంటో చంద్రబాబుకు తెలుసు అన్నారు.. కుప్పం మునిసిపాలిటీలో 25 వార్డుల్లో వైసీపీదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేశార చిత్తూరు ఎంపీ రెడ్డప్ప. ఇక, పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీ లోనూ క్లీన్ స్వీప్ చేయాలన్నది వైసీపీ టార్గెట్ పెట్టుకుంటే.. మరోవైపు వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది.