తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఈనెల 2న కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. లోదొడ్డి గ్రామ వాలంటీర్ వంతల రాంబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను వారు వెల్లడించారు. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబు సన్నిహితంగా ఉండేవాడని.. గత నెలలో అతడు సన్నిహితంగా ఉన్న మహిళ మరిదితో గొడవ జరిగిన కారణంగా గ్రామ పెద్దలు రాంబాబును హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి ఆ మహిళ దూరం కావడంతో రాంబాబు అసహనానికి లోనయ్యాడని… ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం పన్ని ఈనెల 1న రాత్రి కల్లు తాగే ముంతలో కలుపుమొక్కలను నాశనం చేసే గడ్డిమందు కలిపాడని వెల్లడించారు.
Read Also: ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి
ఎప్పుడూ చెట్టు నుంచి కల్లు దించాక తొలుత మహిళ భర్తే తాగేవాడని.. ఆ తర్వాత మిగిలిన వారికి పంచేవాడని.. ఇదే వ్యూహంతో మహిళ భర్తను అడ్డుతొలగించుకోవాలని వాలంటీర్ రాంబాబు కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. అయితే అనూహ్యంగా మహిళ భర్తతో పాటు మరో నలుగురు ఒకేసారి కల్లు తాగారని.. దీంతో మహిళ భర్తతో పాటు మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాగా ఎక్కడైనా నేరం జరిగితే దాన్ని రాజకీయం చేయకుండా పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాకు హితవు పలికారు.