PM Modi: కాంగ్రెస్ ఓవర్సీస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌పై బీజేపీ విరుచుకుపడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ టార్గెట్‌గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిట్రోడా మాట్లాడుతూ.. తూర్పు భారతీయులు చైనీయులుగా, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ఇలాంటి వ్యాఖ్యల్ని తెలంగాణ, కర్ణాటక సీఎంలు అంగీకరిస్తారా..? అని మోడీ ప్రశ్నించారు.
Read Also: Google Wallet: ఇండియాలో గూగుల్ వాలెట్ లాంచ్.. ఇకపై ఇలా చేయొచ్చు!
‘‘ఈశాన్య భారతదేశంలోని వారు చైనీస్‌గా కనిపిస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. దేశం ఇలాంటి వాటిని అంగీకరించగలదా? కాంగ్రెస్ దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్‌ల వలె చూస్తుంది, వారు దీనిని అంగీకరిస్తారా’’ అని ప్రధాని మోడీ అడిగారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో తమిళ సంస్కృతి, గౌరవం కోసం మాట్లాడే డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ తమ బంధాన్ని తెంచుకునే దమ్ముందా..? అని బుధవారం అడిగారు. ఒక పెద్ద నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ప్రధాని అన్నారు.
పశ్చిమ ప్రాంత ప్రజలు అరబ్బులుగా కనిపిస్తారని పిట్రోడా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర ప్రజలు ఇలాంటి భాషను అంగీకరిస్తార..? అని మోడీ ప్రశ్నించారు. ‘‘ ఉత్తర భారతీయులు తెల్లవారిలా కనిపిస్తారా..? కాంగ్రెస్ పార్టీకి ఏమైంది..?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ శామ్ పిట్రోడా యువరాజు తత్వవేత్త, మార్గదర్శకుడని ఆరోపించారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను దేశం వింటోంది, అర్థం చేసుకుంటోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని శిక్షించాలని ఓటర్లకు ప్రధాని పిలుపునిచ్చారు.