ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది.. దీంతో ప్రాజెక్టు సమీపంలోని కాలనీలోకి భారీగా నీరు చేరింది.. వరద ఉదృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.. భారీ వర్షాలు, వరదలతో ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో రాత్రికి రాత్రే ప్రాణాలరచేత బట్టుకోని బయటపడ్డారు పలు ప్రాంతవాసులు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. అయితే, వరదలకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది.. ఇక, ఆ పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.. ప్రతివాదులుగా ఏపీ సీఎస్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కడప కలెక్టర్, రాజంపేట ఆర్డీవోలను పేర్కొంటూ పిల్ దాఖలు చేశారు బీజేపీ నేత రమేష్ నాయుడు.
Read Also: AP: నాటుసారా స్థావరాలపై ఎస్‌ఈబీ ఉక్కుపాదం
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 33 మంది ప్రాణాలు కొల్పోయారని పిటిషనర్ పేర్కొన్నారు.. పెద్ద ఎత్తున మామిడి, నిమ్మ, అరటి, దానిమ్మ, కొబ్బరి, టొమోట తోటలు నష్టపోయాయన్న పిటిషనర్.. మృతుల కుటుంబాలకు.. పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ హైకోర్టును కోరారు.. ఇక, విచారణకు స్వీకరించి హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. ఇదే సమయంలో బాధితులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందోననే వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది.. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.