జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పదో తరగతి ఫలితాలపై పవన్ కళ్యాణ్ తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పదో తరగతి ఫెయిల్ అయ్యారని.. అందుకే ఆయన ఫెయిల్ అయిన విద్యార్థులంటే అభిమానం చూపిస్తున్నారని.. వాళ్లను చూస్తే ఆయనకు స్వజాతి పక్షులం అన్న ఫీలింగ్ కలుగుతుందేమో అంటూ చురకలు అంటించారు. చదువుకుంటే ఎవరైనా పాస్ అవుతారనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు. పదో తరగతి పరీక్షా పేపర్లు తయారు చేసింది.. దిద్దింది టీచర్లేనని.. వైసీపీ నాయకులు కాదనే విషయాన్ని పవన్ గ్రహించాలని పేర్ని నాని హితవు పలికారు.
మరోవైపు చంద్రబాబు, లోకేష్‌పైనా పేర్ని నాని ఆరోపణలు చేశారు. మహానాడు వేదికగా ముసలి సరుకును వదిలించుకుంటామని లోకేష్ చెప్పారని.. అందుకే బండారు సత్యనారాయణ మూర్తికి భయం పట్టుకుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. పువ్వు వాసన చూడటానికి పనికి వస్తుందో రాదో ప్రజల్లో తిరిగే వారికే తెలుస్తుందన్నారు. ఢిల్లీలో నాయకుల చుట్టూ తిరిగే వారికి ఈ విషయం తెలియదన్నారు. చంద్రబాబు 2019లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ తానే గెలుస్తాను అనుకుని కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు.
