ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ టైం వుంది. కానీ అప్పుడే వేడి మరింతగా రాజుకుంది. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన రిపోర్ట్‌లో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తుపెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. అంటే అటు కాంగ్రెస్ తో పొత్తు వుంటుందని గానీ, వుండదు అని గానీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. విజయసాయిరెడ్డి మాదిరిగానే కామెంట్లు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాగితంపై రాసి ఇచ్చే ఏ పార్టీతోనైనా పొత్తుకు తాము సిద్ధమని అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. పొత్తులు అవసరం లేదని చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో ఎవరికైనా మద్దతు ఇస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో మా ఎంపీల అవసరం అనుకునే ఏ కూటమికైనా సరే మద్దతు తెలుపుతాం. కానీ ముందుగా ఆ కూటమి ఏపీ ప్రత్యేక హోదా ఇస్తామని కాగితం మీద రాసివ్వాలన్నారు పేర్ని నాని. వైసీపీని ఎవరూ శాసించలేరని చెప్పారు. పీకే తమ పార్టీకి కన్సల్టెంట్ అని.. ఎన్నికల్లో ఆయన ఆలోచనలు వాడుకుంటామని తెలిపారు.
అంతకుముందు మంత్రి గుడివాడ అమర్నాథ్.. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు పుట్టిందే వైసీపీ అన్నారు. వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు.. కానీ అమలు చేయాలో లేదో నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం జగనే అన్నారు. సోనియాని ఎదిరించి బయటకి వచ్చిన జగన్ అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటారా అని హేళన చేశారు.
Read Also: TSRTC : ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు తీపి కబురు..