అమరావతి: మంత్రిగా తన చివరి మీడియా సమావేశంలో పేర్ని నాని పలు విషయాలపై చర్చించారు. అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్ని నాని తెలిపారు. ముఖ్యంగా తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలే మారిపోయినట్లు వెల్లడించారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చేరాలంటే ఆలోచించేవాళ్లు అని.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు హౌస్‌ఫుల్ బోర్డులు పెడుతున్న ఘటనలు చూస్తున్నామన్నారు.
మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. ఒక మాటపై నిలబడే వ్యక్తి కాదని విమర్శించారు. పార్టీ పెట్టిన మొదట్లో చేగువేరా అని తిరిగిన పవన్.. ఇప్పుడెందుకు ఆయన పేరు ఎత్తట్లేదని ప్రశ్నించారు. పవన్ ప్రేమ, కాపురం బీజేపీతో చేస్తారని.. మరోవైపు చంద్రబాబుకు కన్నుగొడుతుంటారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఒంటినిండా చంద్రబాబే ఉన్నారన్నారు. అటు బీజేపీకి విశ్వసనీయత లేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని తిట్టి మళ్లీ ఆ పార్టీతో కలిశారని పేర్ని నాని విమర్శించారు.
ఏపీలో కరెంట్ కోతలపైనా పేర్ని నాని స్పందించారు. గత ప్రభుత్వం అధిక ధరలకు కరెంట్ కొనుగోలు చేసి రూ.22 వేల కోట్లు అప్పు భారం పెట్టి పారిపోయిందని విమర్శించారు. ఇప్పుడేమో ఆ పార్టీ పెద్ద మనుషులు లాంతర్లు పట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే పాత బకాయిలు తీర్చేవరకు కొత్త కరెంట్ కొనేందుకు వీల్లేదని ప్రధాని మోదీ కొత్త చట్టం తీసుకొచ్చారని.. ఈ చట్టం వల్ల తాము కరెంట్ కొనేందుకు సిద్ధంగా ఉన్నా మార్కెట్లో దొరకట్లేదన్నారు. మూడేళ్లలో రూ.22వేల కోట్లు తీర్చడం ఆషామాషీ వ్యవహారం కాదని పేర్ని నాని స్పష్టం చేశారు.
https://ntvtelugu.com/cm-jagan-comments-on-chandrababu-in-ap-cabinet-meeting/