Perni Nani Comments On Chandrababu Naidu In NTR Centenary Celebrations: ఓవైపు సీనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. ఎంతో చరిత్ర కలిగిన ఎన్టీఆర్‌కు.. తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండ వేయించేకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం గుండెల్ని గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని, దేశంలో రాజకీయ పార్టీల నేతలకు సింహస్వప్నమని కీర్తించారు. పేదలకు రూ.2లకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడని పొగడ్తల వర్షం కురిపించారు.
Sharwanand: కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నాడంటే ..?
పేదలకు పక్కా ఇల్లు పథకం ప్రవేశపెట్టిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్ అని.. మునసబుదారీ వ్యవస్థను రద్దు చేసి, రైతులకు మేలు చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. తెలుగువారి ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర అని, అలాంటి ఎన్టీఆర్‌కు ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి రావడాన్ని చూస్తే బాధేస్తోందని భావోద్వేగానికి లోనయ్యారురు. తనని కుర్చీలోంచి కూలదోసి, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండ వేయించుకునే దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి దుర్మార్గుల చేతుల మీదుగా వర్ధంతులు, జయంతులు జరిపించుకోవాల్సిన దుస్థితి ఎన్టీఆర్‌కు పట్టిందన్నారు. హత్య చేసిన చేతులతో దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు అని.. ఏరుదాటాక తెప్పతగలెట్టే రకమని విమర్శించారు. అరచేతితో సూరీడుని అడ్డుకోలేరన్న ఆయన.. 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Pakistan: పోలీసులే నా కారును దొంగిలించారు.. పీటీఐ నేత ఆరోపణలు
కాగా.. ఈ వేడుకల్లో లక్ష్మీపార్వతి కూడా పాల్గొన్నారు. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే.. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై తాను ఎంతో పోరాడానని, కానీ తన ఆవేదనని ఏ ఒక్కరూ పట్టించుకోలేదని అన్నారు. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు అని తేల్చి చెప్పారు. సరిగ్గా మాట్లాడ్డం కూడా రాని లోకేష్ తానే ఎన్టీఆర్ వారసుడిని చెప్పుకుంటున్నాడని, ఎన్టీఆర్‌ను మోసం చేసిన ఈ దుర్మార్గులు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు చెప్పడానికి.. బ్యానర్ పెట్టడానికి చంద్రబాబుకు అర్హత లేదన్నారు. ఈ వేడుకలకు నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి కూడా హాజరయ్యారు.