సీఎం, ఇరిగేషన్ మంత్రులకు పీఏసీ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. అనంతపురం జిల్లా హంద్రీనీవా ప్రధాన కాల్వ రాగులపాడు వద్ద ఉన్న పంప్ హౌస్ వద్ద నిల్వ నీటిని పంప్ చేయాలని కేశవ్ లేఖలో కోరారు. గత 15 రోజుల నుంచి నీరు నిలిచిపోవటంతో రబీ సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఎకరాకు రూ.40వేల చొప్పున పెట్టుబడి పెట్టిన వేరుశనగ రైతులు దాదాపు 20వేల ఎకరాల్లో పంట వేసి నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.
కొన్ని గ్రామాల రైతులు పంటల్ని కాపాడుకునే అవకాశమున్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదని ఆయన ఆరోపించారు. రాగులపాడు పంప్ హౌస్ వద్ద నిల్వ నీటిని ఎత్తిపోయటం ద్వారా ఆయా గ్రామాల రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవచ్చనని ఆయన అన్నారు. 2017, 2018లో పలుమార్లు నీటిని ఇదే తరహాలో ఎత్తిపోసిన ఘటనలు ఉన్నాయని, తక్షణ చర్యలకు ఉన్నతాధికారుల్ని ఆదేశించాలని కోరుతున్నామన్నారు.